గుడివాడలో కే కన్వెన్షన్లో ఏమి జరిగిందో తెలుసుకునేందుకు తెలుగుదేశంపార్టీ నలుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటి వేసింది. ఆ కమిటిలో సభ్యులైన మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, వర్ల రామయ్య శుక్రవారం గుడివాడలోని కే కన్వెన్షన్ కు వెళ్ళేందుకు ప్రయత్నించినపుడు రచ్చరచ్చ అయ్యింది. గుడివాడలోని టీడీపీ ఆఫీసు నుండి వీళ్ళు బయలుదేరగానే ఎదురుగా వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ర్యాలీగా రావటంతో సమస్య మొదలైంది.




ర్యాలీలో వైసీపీ-టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒకళ్ళని మరొకళ్ళు తోసుకోవటం, ఒకరిపై మరొకరి దాడులు, పోలీసుల లాఠీచార్జి అంతా జరిగిపోయింది. దాంతో పట్టణంలో కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే టీడీపీ ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా అర్ధమవుతోంది. కేకన్వెన్షన్లో ఏమి జరిగిందో తెలుసుకునేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటి వేయటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే కే కన్వెన్షన్లో సంక్రాంతి సందర్భంగా కాసినో జరిపించారని చంద్రబాబునాయుడు దగ్గర నుండి చాలామంది టీడీపీ నేతలు ఇప్పటికే ఎన్నో ఆరోపణలు చేశారు.




ఒకవైపు కన్వెన్షన్లో కాసినో జరిగిందని చెప్పేసిన వీళ్ళు మళ్ళీ ఇపుడు నిజనిర్ధారణ చేయటం ఏమిటి ? పైగా కే కన్వెన్షన్ అన్నది ప్రై ప్రాపర్టీ. అనుమతి లేకుండా ప్రైవేటు ప్రాపర్టీలోకి ఎవరైనా ఎలా వెళతారు ? హెరిటేజ్ లోకి రేపు ఇంకెవరైనా వెళ్ళాలంటే చంద్రబాబు అనుమతిస్తారా ? చంద్రబాబు నివాసముంటున్న కరకట్ట భవనంలోకి పోలీసులు అడుగుపెట్టకుండా టీడీపీ నేతలు అడ్డుకోలేదా ? ప్రభుత్వ భవనంలోకి పోలీసులు వెళ్ళాలంటేనే టీడీపీ నేతలు అంగీకరించలేదు. మరలాంటిది ప్రైవేటు ప్రాపర్టీలోకి టీడీపీ నేతలు ఎలా వెళదామని అనుకున్నారు ? తాము గుడివాడకు వెళితే గొడవ అవుతుందని టీడీపీ నేతలకు బాగా తెలుసు. పైగా కే కన్వెన్షన్లోకి తమను అడుగుపెట్టనీయరని కూడా తెలుసు. అయినా సరే వెళ్ళారంటే వాళ్ళ ప్లాన్ ఏమిటో తెలుస్తోంది.




ఒకవైపు జిల్లా ఎస్పీ ఇదే విషయమై విచారణ చేయమని నూజివీడు డీఎస్పీని ఆదేశించారు. ఈ విషయం తెలిసీ మళ్ళీ నిజనిర్ధారణ పేరుతో టీడీపీ కమిటి ఏమిటి ? ఇదంతా చూస్తుంటే వైసీపీ నేతలను రెచ్చగొట్టేందుకే టీడీపీ ప్లాన్ చేసినట్లు అర్ధమవుతోంది. వైసీపీని రెచ్చగొట్టడం, గొడవలు చేయించటం వల్ల ప్రజల సానుభూతి పొందాలన్న ఆలోచనే కనబడుతోంది. అనవసరంగా లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించటమే టీడీపీ వ్యూహంగా అనుమానంగా ఉంది. కే కన్వెన్షన్ అన్నది మంత్రి కొడాలి నానిది కాబట్టే టీడీపీ ఇలాంటి ప్లాన్ చేసినట్లుంది. మొత్తానికి టీడీపీ ప్లాన్ వర్కవుటైనట్లే ఉంది. చివరకు ఏమవుతుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: