నిన్న మొన్నటి వరకు తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రకటన వెలువడలేదని ఇబ్బంది పడ్డారు నిరుద్యోగులు. నోటిఫికేషన్లు ఎప్పుడిస్తారా అని ఎదురు చూశారు. తీరా సీఎం కేసీఆర్ ఆ శుభవార్త చెప్పిన తర్వాత కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. కానీ ఇప్పుడో సమస్య నిరుద్యోగుల్ని చుట్టుముట్టింది. చదవాలంటే పుస్తకాలు దొరకడంలేదు. సరైన మెటీరియల్ అందుబాటులో లేదు.

పోటీ పరీక్షలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా గణాంకాలు అందుబాటులోకి వస్తాయి. స్టాక్ జీకేని పక్కనపెడితే.. కరెంట్ అఫైర్స్ ని చదవడం మరింత అవసరం. ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ తో పాటు, అప్ డేట్ అయిన గణాంకాలతో పుస్తకాలు మార్కెట్ లో అందుబాటులో లేవు.

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రకటన వేళ.. పోటీపరీక్షల పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. కొవిడ్‌ కారణంగా ఇటీవల భారీగా పడిపోయిన బిజినెస్ నిలబెట్టుకునేందుకు పుస్తకాల విక్రేతలు, పబ్లిషర్స్ కి కూడా కాలం కలిసివచ్చిందనే అనుకున్నారంతా. కానీ ముడి సరకు అయిన పేపర్ కొరత ఇబ్బంది పెడుతోంది. పేపర్ ధరలు కూడా చుక్కల్లో ఉన్నాయి. దీంతో పుస్తకాల ముద్రణ లాభసాటి కావడంలేదు. దీంతో ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. పోనీ ధరలు పెరిగినా పుస్తకాలు మాత్రం అందుబాటులో లేవు.

హైదరాబాద్‌ తోపాటు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉన్న కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అందుబాటులో ఉన్న పుస్తకాల ధరల కూడా పెరిగాయని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీకోసం ప్రిపేర్ అయ్యేవారు 1నుంచి 10వ తరగతి వరకు కొత్త సిలబస్ ప్రకారం పాఠ్య పుస్తకాలకోసం వెదుకుతున్నారు. కానీ అవి దొరకడంలేదు. తెలుగు అకాడమీలో పరిమితంగా కొన్ని పుస్తకాలే అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. కోఠిలో సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకాల షాపుల్లో కూడా కొరత ఏర్పడింది. అన్నిరకాల పుస్తకాలు అక్కడ అందుబాటులో లేవు. దీంతో పుస్తకాలకోసం నిరుద్యోగులు చక్కర్లు కొడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: