సీఎం జగన్ పై జనసేన నేత నాదెండ్ల మనోహర్ పంచ్ వేశారు. జగన్ పాలన చేస్తున్నారా లేక వడ్డీ వ్యాపారం చేస్తున్నారా అని మండిపడ్డారు. ఓవైపు గిట్టుబాటు ధరలు లేక, పంట చేతికొస్తుందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో ఏపీ రైతులు ఉన్నారని, అయితే వారినుంచి నీటి తీరువా వసూలు చేసే విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉందని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. 2018 నుంచి నీటి తీరువా లెక్కగట్టిన వైసీపీ ప్రభుత్వం బకాయిలకు 6 శాతం వడ్డీతో రైతుల నుంచి వసూలు చేయడం దారుణం అని అన్నారాయన. నీటి తీరువా కట్టకపోతే రైతు భరోసా ఇవ్వలేమని చెప్పడం, భవిష్యత్తులో పంట బీమా విషయంలో అనర్హులుగా ప్రకటిస్తామని చెప్పడం సర్కారు నిరంకుశత్వానికి పరాకాష్ట అంటున్నారు నాదెండ్ల.

సీఎం జగన్ ఏపీలో పాలన చేస్తున్నారా? లేక వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు నాదెండ్ల మనోహర్. గత నెలలో ఆస్తి పన్ను పేరుతో ప్రజలను వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. ఈ నెల రైతులను టార్గెట్ చేశారని అన్నారు. నీటి తీరువా పన్ను పేరుతో రైతులను వేధిస్తున్నారంటూ మండిపడ్డారు నాదెండ్ల. గ్రామాలలో వాలంటీర్లను టార్గెట్ గా పెట్టి మరీ నీటి తీరువా పన్ను వసూలు చేయిస్తున్నారని, కొన్ని జిల్లాల్లో చిన్న చిన్న గ్రామాలకు సైతం 30 లక్షల రూపాయలు టార్గెట్ పెడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

వారికి వడ్డీ కట్టరా..?
రైతుల నుంచి ధాన్యం సేకరించిన మూడు రోజుల్లోనే వారికి నగదు జమ చేస్తామని, రైతుల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, మరి దానికి వడ్డీ లేదా అని ప్రశ్నించారు నాదెండ్ల. నెలలు గడిచినా రైతులకు ధాన్యం సొమ్ము జమ కావడంలేదని, అలా రైతులకు పాలకులు ఇవ్వాల్సిన సొమ్ముకి కూడా వడ్డీ కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారానికి కూడా 6 శాతం వడ్డీ కట్టి ఇవ్వాలని అన్నారు నాదెండ్ల. మొత్తమ్మీద వైసీపీ పాలనపై సీరియస్ అలిగేషన్స్ చేశారు నాదెండ్ల మనోహర్. ఇప్పటికే బాదుడే బాదుడు పేరుతో టీడీపీ ఓవైపు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ జనంలోకి వెళ్తోంది. ఇప్పుడు జనసేన కూడా అదే విషయంలో ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోందని ఆరోపణలు చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: