వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప పార్టీ ప్రయోజనాలను పట్టించుకోని మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ కు పెద్ద షాక్ కొట్టిందట. తొందరలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నారు. పార్టీలో నిత్యసమ్మతివాదిగా ముద్రపడిన రాజగోపాల్ వీలైనంతగా పార్టీని డ్యామేజ్ చేయాలనే అనుకున్నారు. అందుకనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పార్టీలోనే ఉంటు పార్టీని డ్యామేజ్ చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు.






ఇందులో భాగంగానే నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లాలో తమ మద్దతుదారులతో సమావేశాలు పెట్టుకోవాలని అనుకున్నారు. బీజేపీలోకి చేరేటపుడు ఎంతమంది వీలైతే అంతమందిని తనతో పాటు తీసుకెళ్ళాలన్నది ఎంఎల్ఏ ఆలోచన. ఇందుకోసమే మంగళవారం మర్రిగూడ, చందూరు మండలాలతో మొదటివిడత మీటింగ్ పెట్టుకున్నారు. తొందరలోనే తాను బీజేపీలో చేరబోతున్నట్లు చెప్పి తనతో వచ్చేవాళ్ళెవరని అడిగారట. అయితే తామెవరము బీజేపీలో చేరే ఉద్దేశ్యంలో లేనట్లు మండల, గ్రామస్ధాయి నేతలు తెగేసిచెప్పారట.





వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి పార్టీ మారుతున్న కారణంగా తాము మాత్రం బీజేపీలోకి మారేదిలేదని చెప్పేశారట. నిజానికి పార్టీవల్ల ఎంఎల్ఏకి జరిగిన నష్టం ఏమీలేకపోయినా పీసీసీ రాలేదనో లేకపోతే సీఎల్పీ పదవి రాలేదనో కారణం తప్ప ఇతరత్రా ఎలాంటి సమస్యలు లేకపోయినా పార్టీ మారిపోవటం అంటే అది ఎంఎల్ఏ వ్యక్తిగత అజెండాగానే మద్దతుదారులు చూశారట. అందుకనే తామంతా కాంగ్రెస్ లోనే ఉంటామని గట్టిగా చెప్పారట. దాంతో షాక్ తిన్న ఎంఎల్ఏ మద్దతుదారులను కన్వీన్స్ చేయటానికి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయిందని సమాచారం.






ఇక బుధవారం చౌటుప్పల్, మునుగోడు, నారాయణపూర్ మండలస్ధాయి నేతలతో సమావేశం అయ్యారు. మరీ సమావేశంలో ఎంఎల్ఏకి మద్దతుదారులకు మధ్య జరిగిన చర్చలు ఇంకా బయటకురాలేదు. తాను చెప్పగానే తమ పదవులకు రాజీనామాలు చేసేసి అందరు తనతో పాటే బీజేపీలోకి వచ్చేస్తారని ఎంఎల్ఏ ఊహించారు. కానీ మీటింగులో సీన్ పూర్తిగా రివర్సయ్యింది. మిగలిన మూడు మండలాల నేతల సమావేశంలో కూడా ఇదే అనుభవం ఎదురైతే ఎంఎల్ఏ ఏమిచేస్తారు ? ప్రిస్టేజి కొద్దీ ఒక్కడే బీజేపీలో చేరటం ఖాయమంటున్నారు. పార్టీలో చేరగానే ఎంఎల్ఏతో రాజీనామా చేయించాలని కమలనాదులు డిసైడ్ అయ్యారట. మరి రాజీనామా తర్వాత ఏమి జరుగుతుందో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: