
అయితే దేశం అంతా అనుకుంటున్న విధంగా బీజేపీకి గుజరాత్ లో విజయం అంత ఈజీ గా దక్కలేదు. అందుకోసం బీజేపీ క్షేత్రస్థాయి లో ఉన్న కార్యకర్త నుండి అధిష్ఠానములోని ముఖ్య నాయకులు అందరూ ఎంతగానో శ్రమించి అధికారాన్ని నిలుపుకున్నారు. బీజేపీ గెలుపు రహస్యం ఏదైనా ఉంది అంటే... అది ఎన్నిక ఏదైనా, ఎక్కడైనా గెలుపే ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగుతుంది, గెలవడానికి అవసరం అయిన అన్ని ప్రయత్నాలను చేస్తుంది. ప్రతి ఒక్కరిలో గెలవాలి అన్న మీమాంస ఉంటుంది. ఇదే వారిని గుజరాత్ లో ఎదురులేని పార్టీగా నిలిపింది అని చెప్పాలి. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని తప్పిదాలు కూడా బీజేపీ గెలుపుకు ఉపయోగపడ్డాయి.
గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికి ఆ ఫీలింగ్ ను మనసులో పెట్టుకుని గర్వాన్ని ఎక్కడా ప్రదర్శించలేదు, పైగా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎంపీ మరియు మంత్రుల పనితీరును గమనిస్తూ, పార్టీ గెలుపుకు మైనస్ అవుతారని గుర్తించి ఎన్నికల ముందు సీఎం విజయ్ రూపాని మరియు వారి గ్రూప్ ను పక్కన పెట్టేసింది. ఈ ఒక్క విషయం బట్టి చూస్తే పార్టీ గెలుపు కోసం ఎంతటి నాయకుడినైనా పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది బీజేపీ అధినాయకత్వం. గత రెండు పర్యాయాలుగా కేంద్రంలో బీజేపీ పాలన జరుగుతోంది అంటే నిష్పక్షపాత ధోరణి కారణమని చెప్పాలి.