కేంద్రంలో బీజేపీకి ఇప్పటి వరకు వైసీపీ దాదాపు మిత్రపక్షం కంటే ఎక్కువ మద్దతుగా నిలిచింది. బీజేపీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎన్నో బిల్లులకు వైసీపీ మద్దతుగా నిలిచింది. మోడీ సైతం జగన్ అంటే అభిమానం చూపించే వారు. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో పరిస్థితులు మారిపోయాయి. ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ జట్టు కట్టింది. ఇక్కడ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మరో వైపు కేంద్రంలో పరిస్థితులన్నీ రివర్స్ అయ్యాయి. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. దీంతో ప్రతిపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. టీడీపీ కేవలం ఒక కేబినెట్ మంత్రి పదవి మాత్రమే తీసుకున్నప్పటికీ బీజేపీకి ఎనలేని మద్దతుగా అందిస్తోంది. ఈ తరుణంలో వైసీపీకి ఇంత వరకు పరోక్షంగా అండగా నిలిచిన బీజేపీ ప్రస్తుతం పక్కకు తప్పుకుందనే వాదన వినిపిస్తోంది. ఈ సమయంలో వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఒక సాఫ్ట్ వార్నింగ్‌గా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 25 పార్లమెంటు స్థానాలలో 21 స్థానాలలో గెలిచాయి. టీడీపీకి లోక్‌సభలో 16 ఎంపీల బలం ఉంది. ఆ పార్టీ మద్దతు ప్రస్తుతం బీజేపీకి చాలా అవసరం. అయితే టీడీపీకి రాజ్యసభలో ప్రస్తుతం ప్రాతినిథ్యం లేదు. మరో వైపు వైసీపీకి మాత్రం 11 మంది సభ్యుల బలం ఉంది. లోక్‌సభలో వైసీపీకి 4 మంది సభ్యులు ఉన్నారు. ఇలా పార్లమెంటులో వైసీపీకి 15 మంది సభ్యులు ఉన్నారు. దీనినే ప్రస్తుతం విజయసాయి రెడ్డి గుర్తు చేస్తున్నారు. రాజ్యసభలో తమ అవసరం బీజేపీకి ఉంటుందని చెబుతున్నారు. తమను కాదనుకుంటే తమ మద్దతు వదులుకోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నంత మాత్రాన పండగ అయిపోనట్లు కాదని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం ఏదైనా బిల్లును రాజ్యసభలో బీజేపీ ప్రవేశపెడితే ఖచ్చితంగా తమ మద్దతు ఆ పార్టీకి అవసరం అవుతుందని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయసాయి రెడ్డి వ్యాఖ్యల్లో సైతం నిజం ఉంది. వైసీపీ నేతలపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. దీనిపై బీజేపీ మౌనం దాల్చింది. ఈ తరుణంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం ఏపీలో పరిణామాలపై మౌనంగా ఉండడాన్ని వైసీపీ సహించలేకపోతోంది. గత ఐదేళ్లలో బీజేపీకి కేంద్రంలో వైసీపీ మద్దతుగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో తమను ఏకాకిని చేస్తే తమ బలం ఏంటో రాజ్యసభలో చూపుతామని పరోక్షంగా హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: