ఈమె 2025 ఏప్రిల్ 29 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈమె ఇది వరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా మూడేళ్ల పాటు పనిచేసి 2020 జులైలో పదవీ విరమణ పొందారు. కొవిడ్ సమయంలో కీలక బాధ్యతలు సమర్థంగా నిర్వహించి ప్రభుత్వ మెప్పు పొందారు. అంతకు ముందు ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఏపీలో పనిచేసినప్పుడు విపత్తు నిర్వహణ, పర్యాటకం, ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ రంగ వ్యవహారాలు చూశారు.
గతంలో జగన్ ప్రభుత్వం ఈమెను ఇబ్బంది పెట్టాలని చూసింది. పదవీ విరమణ చేసిన ఏడు నెలల తర్వాత.. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ 2021 ఫిబ్రవరిలో నాటి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నోటీసులు జారీ చేశారు. ఆమె ఆలిండియా సర్వీస్(కాండాక్ట్) రూల్స్ 1968 నిబంధనలు ఉల్లంఘించినట్లు అందులో ఆరోపించారు. ఆమె పౌరసరఫరాల ఎండీగా పనిచేసినప్పుడు అమెరికాలో ఉంటున్న తన కుటుంబాన్ని కలవడానికి మార్చి 1 నుంచి సెలవు తీసుకున్నారు.
అమెరికాలో తాను ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా ప్రపంచ బ్యాంకు పరిధిలోని రీసెర్చ్ డెవలప్ మెంట్ యూనిట్ తో కలిసి అధ్యయనం చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సెలవును పొడిగించుకున్నారు. వాస్తవానికి ఆమె తన పర్సనల్ కోర్సు నేర్చుకోవడానికి జీతం తీసుకుంటూ అమెరికాలో ఉంటున్నారు. ఈ సెలవులను ఆర్జిత సెలవుకింద మార్చుకోవడాన్ని తప్పు పడుతూ జగన్ సర్కారు సంజాయిషీ అడిగింది. వాస్తవానికి ఆమె అలా చేయడం నిబంధనలు ఉల్లంఘనే. ఆ సమయంలో జగన్ సర్కారు చేసింది రైటే అయినా ఆమెకు కేంద్రం అండ ఉండటంతోఈ వివాదం సద్దుమణిగింది.