ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు, ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తున్నారు. ఇదే కోవలో జగన్‌కు బంధువు, వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. సొంత బంధువు, పార్టీలో కీలక నేత రాజీనామా చేయడంతో జగన్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. వైఎస్ జగన్ వైసీపీని పెట్టినప్పటి నుంచి బాలినేని ఆయనకు అండగా ఉన్నారు. పార్టీలో కీలక నేతగా ఉంటూ ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టే వారు. అయితే ఎన్నికలకు ముందు నుంచి ఆయనకు వైసీపీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఆయన డిమాండ్లను వైసీపీ అధినేత జగన్ పక్కన పెట్టారు. 

సొంత జిల్లా ప్రకాశంలోనూ ఆయనకు ప్రాధాన్యత తగ్గింది. ఆయనను పక్కన పెట్టి చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర రెడ్డిని పార్టీ జిల్లా ఇన్ ఛార్జ్‌గా, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా జగన్ బరిలోకి దింపారు. దీనిని ఆయన సహించలేకపోయారు. ఎన్నికల ముందు దీనిపై ఆయన బెట్టు చేశారు. అయితే ఎన్నో చర్చల తర్వాత అయిష్టంగా జగన్ నిర్ణయాన్ని ఆయన ఒప్పుకున్నారు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. దీంతో ఊహించినట్లుగానే బాలినేనితో సహా జిల్లాలో వైసీపీ అభ్యర్థులు ఎందరో పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్న ఆయనను జగన్ ఇటీవల పిలిచి మాట్లాడారు. అయినా బాలినేని వెనక్కి తగ్గలేదు. చివరికి ఆ పార్టీకి రాజీనామా చేశారు. సొంత బంధువు జగన్‌ను కాదని, ఆయన తనను గౌరవించే పవన్ పార్టీలో చేరనున్నారు.

జగన్‌కు చిన్నాన్న వరుస అయ్యే వైవీ సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాస రెడ్డి బావమరిది. ఇలా జగన్‌కు దగ్గర బంధుత్వం ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక బాలినేనికి జగన్ మంత్రి పదవి ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత బాలినేనిని జగన్ దూరం పెట్టారు. అయితే అదే జిల్లా నుంచి మరో మంత్రి ఆదిమూలపు సురేష్‌‌ను మాత్రం మంత్రివర్గంలో కొనసాగించారు. ఇది బాలినేనిని బాధ పెట్టింది. తర్వాత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయనకు ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయి.


 వైసీపీలో ఉన్న బాలినేనిని మొదటి నుంచి జనసేన అధినేత పవన్ ఎంతో గౌరవిస్తూ వచ్చారు. దీంతో ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన దిశగా బాలినేని అడుగులు పడ్డాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబుతో బాలినేని మంతనాలు సాగించారు. ఇక గురువారమే డిప్యూటీ సీఎం పవన్‌‌తో బాలినేని భేటీ కానున్నారు. వీరి భేటీ తర్వాత బాలినేని ఎప్పుడు జనసేనలో చేరతారో స్పష్టత రానుంది. ఈ పరిణామం జగన్‌కు ఇబ్బందికరమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్‌కు సొంత చెల్లి షర్మిల దూరమైంది. ఇప్పుడు బాలినేని సైతం దూరం కావడంతో ఆ పార్టీని మరింత మంది నేతలు సైతం వీడుతారని ప్రచారం సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: