
పొలాల్లో పని చేస్తున్న రైతులను పరామర్శిస్తూ, వారి అవసరాలను తెలుసుకుంటూ, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇది చూసిన ప్రజలు "వామ్మో.. ఇలాంటి పెద్దాయన ఇంతకష్టపడుతున్నారా!" అని ఆశ్చర్యపోతున్నారు. 80 ఏళ్ల వయసులో కూడా ఆయన నడకకు వేగం తగ్గలేదు. ఎలాంటి సపోర్టు లేకుండానే ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లో ఉండి చాలా అనుభవం ఉన్నప్పటికీ, రచ్చబండ వద్ద కూర్చొని ఉపదేశాలు చెప్పే తరహాలో కాకుండా, తానే ముందుగా జనాల వద్దకు వెళ్లాలనుకోవడం ఆయనలోని నేతృత్వ లక్షణాలను చాటుతుంది. ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో ఆయనకు తిరుగులేదు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఆయనకు ప్రత్యేకమైన పట్టు ఉంది. ప్రతి ఇంటికీ ఆయనకు పరిచయం ఉంది. అందుకే ప్రజలు ఆయన్ను 'మా కుటుంబ పెద్ద' అని భావిస్తారు. MLAగా అనేకసార్లు విజయం సాధించడమూ దానికి నిదర్శనం. ప్రజల మద్దతు ఎలా ఉండాలో గోరంట్ల నుంచి నేర్చుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
2024లో ఆయనకు చివరి ఎన్నిక అవుతుందని భావించారు. ఆయన కూడా ఒక దశలో ఇదే తన చివరి ఎన్నిక అని చెప్పినట్లు సమాచారం. కానీ తాజా పర్యటనలు చూస్తే పరిస్థితి మళ్లీ మారినట్లు కనిపిస్తోంది. మళ్లీ 2029 ఎన్నికల్లోనూ పోటీ చేసే సంకల్పంతో ఆయన ముందుకుసాగుతున్నారు అని ప్రచారం జరుగుతోంది.నియోజకవర్గాల పునర్విభజనలో రాజమండ్రి రూరల్ మళ్లీ తనకే ఉంటుందని, అప్పటికీ ఈ కూటమి అధికారంలోనే ఉంటుందని గోరంట్ల ఆశాభావంగా ఉన్నారట. ఇక పార్టీ కార్యకర్తలకూ ఆయన శ్రమే పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. మొత్తానికి రాజకీయ భీష్మాచార్యుడు నాటౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఆయన మళ్లీ 2029లోనూ మైదానంలో ఉండబోతున్నారు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.