
రాష్ట్ర రాజకీయాల్లో గిరిజన ఓటు బ్యాంకు ప్రాధాన్యం పెరుగుతోంది. సుమారు 10 - 12 శాతం ఓటు వాటా గిరిజనులదే. సాధారణంగా పెద్ద పార్టీలు ఈ శాతం పెద్దగా పట్టించుకోకపోయినా, వాస్తవానికి ఈ వర్గం గెలుపోటములను ప్రభావం చూపే స్థాయిలో ఉంది. గిరిజనుల ప్రభావం కేవలం రిజర్వు నియోజకవర్గాలకే పరిమితం కాకుండా, ఇతర సాధారణ నియోజకవర్గాల్లో ఉన్న ఎస్టీ ఓటర్లపైనా ఉంటుంది. అందుకే ఈ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా కదులుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉన్న గిరిజన ఓటు, గత రెండు ఎన్నికల్లో వైసీపీ ఖాతాలోకి వెళ్లింది. ముఖ్యంగా 2014, 2019లో గిరిజన నియోజకవర్గాల్లో వైసీపీ ఏకపక్షంగా గెలవడంలో, వారి పట్టుదలతో చేసిన చేరికలు, హామీలు కీలకంగా మారాయి. 2024లో కూటమి పార్టీల చురుకుదనంతో వైసీపీ ఆధిపత్యం కొంత తగ్గినా, ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో వైసీపీ ప్రభావం గట్టిగానే ఉంది.
ఈ ప్రభావాన్ని చెరిపివేయడానికి కూటమిలోని జనసేన ముందడుగు వేసింది. మన్యం, పోలవరం లాంటి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తూ, స్థానిక ప్రజలతో నేరుగా మమేకమవుతోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా గిరిజన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, చెప్పులు, మామిడికాయలు, చీరలు పంపిణీ చేయడంతో పాటు, రహదారుల నిర్మాణానికి సహకరిస్తున్నారు. ఈ చర్యలు గిరిజన ఓటు జనసేన వైపుకు మళ్లుతుందన్న చర్చకు దారితీశాయి. ఇక వైసీపీ ఈ విషయంలో పెద్దగా స్పందించకపోవడం, టీడీపీకి బాగా కలిసి వస్తోంది. కూటమిలో ఉన్నా, రాజకీయ పోరులో ఎవరి బలహీనత వారిదే అని భావిస్తూ, టీడీపీ కూడా నేరుగా గిరిజన ప్రాంతాల్లో చురుకుగా కదులుతోంది.
ఇటీవల మన్యం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు, గిరిజన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా, పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైసీపీ దూకుడుకు వారు ఎలాంటి ప్రతిస్పందన ఇస్తున్నారో తెలుసుకోవడమే కాకుండా, స్థానిక ఎమ్మెల్యేపై నేరుగా ప్రశ్నలు వేశారు. ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నాయకులను మరింత చురుకుగా పనిచేయమని ఆదేశించారు. అంతేకాదు జనసేన నాయకులతో కలిసి మీరు కూడా తిరగాలి... ఎక్కడా వెనక్కి తగ్గకండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో, గిరిజన ఓటు కోసం అటు జనసేన, ఇటు టీడీపీ - ఇరుపార్టీలు ఒకేసారి వ్యూహాత్మకంగా కదులుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఈ 10-12 శాతం ఓటు బ్యాంకు ఫలితాలను ప్రభావితం చేసే శక్తిగా నిలవడం ఖాయం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు