చిలకలూరిపేట రాజకీయాల్లో మళ్లీ ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ విడుదల రజనిని మళ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడం పార్టీలో పెద్ద వివాదానికి దారి తీసింది. రజనీ వ్యతిరేక వర్గం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవలే నిర్వహించిన సమావేశంలో వందలాది మంది స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని రజనీపై తీవ్ర‌ ఆరోపణలు చేశారు. రజనీ తీరుతోనే పార్టీ బలహీనపడిందని, నేతలు దూరమయ్యారని, కార్యకర్తలపై అనవసరంగా కేసులు మోపించారని వాపోయారు. 2019లో తొలిసారి పోటీ చేసి గెలిచిన రజనీకి జగన్ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య శాఖ ద‌క్కింది. ఆ కాలంలోనే ఆమెపై వర్గపోరు ఆరోపణలు మొదలయ్యాయి. తనను విమర్శించిన వారిపై కక్షసాధించారని, కుటుంబ సభ్యుల ప్రభావం ఎక్కువైందని పార్టీ లోపలే పలువురు మండిపడ్డారు. ఆ సమయంలో కేసుల్లో ఇరుక్కున్న నాయకులు ఇంకా బయటపడలేదని చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో మళ్లీ ఆమెకే బాధ్యతలు అప్పగించడం వల్ల పార్టీ బలహీనమవుతుందని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు.


2024లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన రజనీ అక్కడ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తిరిగి తన పాత స్థలం చిలకలూరిపేటకే వచ్చారు. పార్టీ అధిష్ఠానం కూడా ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆమె మళ్లీ ఇన్చార్జ్‌గా కొనసాగుతున్నారు. ఇది స్థానికంగా వ్యతిరేక వర్గానికి పెద్ద షాక్‌గా మారింది. మర్రి రాజశేఖర్ వంటి బలమైన నేతను వదులుకోవడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని, ఇప్పుడు మళ్లీ రజనీని ముందుకు తేవడం తప్పని వారు చెబుతున్నారు. మర్రి రాజశేఖర్ ఒకప్పుడు వైసీపీకి అక్క‌డ బ‌ల‌మైన లీడ‌ర్‌. మ‌ర్రి పార్టీని విడిచిపెట్టడం స్థానికంగా పార్టీకి పెద్ద మైన‌స్ అయ్యింది. ఇలాంటి సమయంలో టిడిపిని ఎదుర్కోగలిగే, బలమైన నేత అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. కానీ పార్టీ అధిష్ఠానం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన స్పందన ఇవ్వలేదు.


రజనీకి వ్యతిరేకంగా వర్గం బలంగా నిలవడంతో పార్టీకి అంతర్గత సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. స్థానికంగా కార్యకర్తలు అసంతృప్తిగా ఉంటే రాబోయే రోజుల్లో పార్టీ బలహీనమయ్యే ప్రమాదం ఉందని నేతలే అంటున్నారు. ఏదేమైనా విడుదల రజనిని చిలకలూరిపేట ఇన్చార్జ్‌గా కొనసాగించడం పార్టీకి బలమా? లేక బలహీనతగా మారుతుందా? అన్నది రాబోయే రోజులు తేల్చబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: