ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు మంత్రివర్గంపై తాజాగా కేటాయించిన ర్యాంకులు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మొదటి స్థానంలో నిలవగా, కృష్ణా జిల్లాకు చెందిన కొల్లు రవీంద్ర, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చం నాయుడు, అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ వంటి నేతలు చివరి స్థానాల్లో నిలవడం మంత్రివర్గంలో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా “మంత్రులు ఎందుకు వెనుకబడ్డారు?” అనే ప్రశ్నకు ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. గతంలో కూడా చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు కేటాయించిన విషయం తెలిసిందే. అప్పుడు బాగానే ఉన్న కొందరు నేతల గ్రాఫ్ ఇప్పుడు పడిపోవడం గమనార్హం. దీనిపై ఆయా మంత్రులు మాత్రం తమ వాదనను స్పష్టంగా వినిపిస్తున్నారు. ఒకవైపు నియోజకవర్గ పర్యటనలు, మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత, అదే సమయంలో పార్టీ కార్యకలాపాలు, ప్రతిపక్ష వైసీపీ విమర్శలకు సమాధానం చెప్పడం వంటి అంశాలతోనే తమ సమయం అంతా వెచ్చిపోతుందని మంత్రులు చెబుతున్నారు.


ఫలితంగా, కార్యాలయాలకు వెళ్లి శాఖల ఫైళ్లను పరిశీలించే అవకాశం దాదాపుగా లేకుండా పోతుందని వారి వాదన.
సుపరిపాలనలో తొలి అడుగు, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి కీలక పథకాలను అమలు చేయడంలో మంత్రులు కీలకపాత్ర పోషిస్తున్నారు. దీనివల్ల వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి వస్తోంది. ఫలితంగా తమ శాఖలకు సంబంధించిన ఫైళ్లు క్లియర్ చేయడం ఆలస్యమవుతోందని నారాయణ, పయ్యావుల కేశవ్, అచ్చం నాయుడు, కొల్లు రవీంద్ర లాంటి నేతలు స్పష్టంగా చెబుతున్నారు. ఆదివారాలు కూడా పని చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ సమస్య తాజాగా చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో, ఆయన వారంలో రెండు రోజులు మంత్రులను పూర్తిగా ఫ్రీగా వదిలేయాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అలా చేస్తే మంత్రులు శాఖలకు సంబంధించిన పనులను చక్కబెట్టేందుకు సమయం కేటాయించగలరని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతం మంత్రులు ఎదుర్కొంటున్న ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ, ప్రభుత్వం, నియోజకవర్గం అనే మూడు వైపుల ఒత్తిడితో మంత్రులు సమయం కేటాయించలేక ఇబ్బందులు పడుతున్నారు. దీని పరిష్కారం కోసం చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: