
ఎన్డీయే అభ్యర్థికి వైసీపీ ఓటు! :
విపక్షంలో ఉన్న ఇండియా కూటమని వదిలిపెట్టి, వైసీపీ మాత్రం ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కి ఓటేసింది. దీని మీదే విమర్శల వర్షం కురుస్తోంది. "2024లో ఎన్డీయే వైసీపీని దించేసింది .. ఇప్పుడు అదే కూటమికి మద్దతు ఎందుకు?" అన్న ప్రశ్నే ఎక్కువమంది వేస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి నేతల నుంచి సాధారణ మేధావుల వరకు ఇదే ప్రశ్న. అంటే వైసీపీ "సిద్ధాంతం మిస్" అయిందా అన్న చర్చ మొదలైంది.
సిద్ధాంత పునాది గందరగోళం :
ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించాలంటే ఒక సిద్ధాంతం ఉండాలి. వైసీపీ ఎప్పటినుంచీ లౌకికవాదం, ప్రజాస్వామ్య వాదం వైపు నిలబడి ఉంది. అదే పార్టీకి బలం. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాల మద్దతే వైసీపీని ఏపీలో గెలిపించింది. అలాంటి పార్టీ ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు ఓటేయడం – రాజకీయంగా తడబాటు కాదా? అన్నది ఇప్పుడు చర్చలో హాట్ టాపిక్.
న్యూట్రల్‌గా ఉండి ఉంటే? :
బీఆర్ఎస్, బిజూ జనతాదళ్ లాగా వైసీపీ కూడా తటస్థంగా ఉండి ఉంటే ఎవరూ విమర్శించేవారు కాదు. కానీ నేరుగా మద్దతు ఇవ్వడం వల్ల ఇప్పుడు "వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందా?" అన్న సందేహం మేధావుల్లో కలుగుతోంది. రేపటి రోజున ఎన్నికల్లో ఎన్డీయే మీద పోరాడతామంటే, ప్రజలు ఎంత నమ్ముతారు అన్న ప్రశ్న కూడా వస్తోంది.
కాంగ్రెస్ దాడి ప్రారంభం :
ఈ నిర్ణయం కాంగ్రెస్‌కీ చక్కటి ఆఫర్ ఇచ్చినట్టే అయింది. ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ "జగన్ బీజేపీ వ్యతిరేక భావజాలానికి వెన్నుపోటు పొడిచారు" అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల "జగన్ మోడీకి దత్తపుత్రుడు" అని మళ్లీ మంట పెట్టారు. అంటే వైసీపీ ఇప్పుడు డిఫెన్స్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి.
మొత్తానికి…
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వేసిన ఓటు, ఒక చిన్న నిర్ణయం కాదు. అది పార్టీ సిద్ధాంతానికి, భవిష్యత్తు పోరాటానికి పెద్ద సవాలు. "రాజకీయంగా ఓడినా ఓకే.. కానీ సిద్ధాంతపరంగా ఓడిపోవద్దు" అనే మాట ఇక్కడ గుర్తుకు వస్తోంది. వైసీపీ ఈ నిర్ణయం నుంచి బయటపడుతుందా, లేక నిజంగానే తన పునాదిని దెబ్బతీసుకుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.