తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా దృష్టిని ఆకర్షిస్తున్న ఒక్క ఉప ఎన్నిక అంటే అదే జూబ్లీహిల్స్! బీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే దివంగత గోపీనాథ్ మృతి తర్వాత ఖాళీ అయిన ఈ హైప్రొఫైల్ సీటుకు ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే వచ్చేసింది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా… తెలంగాణ రాజకీయాల్లో ఈ ఉప ఎన్నికకు హీట్ మొదలైపోయింది. బీఆర్ఎస్ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ కూడా ఈరోజుతో తమ అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం నవీన్ యాదవ్‌కు గ్రీన్ సిగ్నల్ దాదాపు ఖాయం. మరోవైపు బీజేపీ కూడా అభ్యర్థి ఎంపికలో ఫైనల్ స్టేజ్‌లో ఉందని తెలుస్తోంది. అంటే అన్ని పార్టీలూ రెడీ, ఇక మిగిలింది మైదానంలో ప్రచార సంగ్రామమే.


 జూబ్లీహిల్స్ ప్రత్యేకత: జూబ్లీహిల్స్ అంటే ధనికుల ఏరియా మాత్రమే కాదు. ఇక్కడ మధ్య తరగతి, పేదల ఓటు బ్యాంక్ కూడా ఉంది. ముఖ్యంగా ఏపీలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన తెలుగు ఓటర్ల ప్రభావం బలంగా ఉంటుంది. పైగా సినిమా పరిశ్రమ, టాప్ పొలిటికల్ లీడర్ల నివాసాలు - అన్నీ ఒకే ప్రాంతంలో! బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు - ఇలా అంద‌రు ఇక్కడే నివసించడం ఈ నియోజకవర్గాన్ని మరింత హాట్‌సీటుగా మార్చేసింది.బాబు ఫోకస్ – కూటమి ఫార్ములా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తెలంగాణ టీడీపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మంగళగిరిలో కలిశారు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం టీడీపీ కూడా శక్తివంచన లేకుండా కృషి చేయాలనే దిశానిర్దేశం బాబు ఇచ్చారు. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపైనా నేతలతో చర్చించారు.



 బీజేపీకి టీడీపీ బూస్ట్: జూబ్లీహిల్స్ సీటులో కూటమి అభ్యర్థి అంటే బీజేపీ అభ్యర్థినే. ఎందుకంటే … ఏపీలో ఇప్పుడు టీడీపీజనసేనబీజేపీ కూటమి అధికారంలో ఉంది. కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. కాబట్టి ఈ సీటులో టీడీపీ స్పష్టంగా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వనుంది. అంటే ప్రచారం, వ్యూహం —అందరూ ఒక తాటిపైకి వచ్చి. తెలంగాణలో బీజేపీకి ఇది ప్రతిష్టాత్మక సీటు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కూటమి గెలిస్తే… అది పెద్ద షాక్ అవుతుంది. టీడీపీ కూడా ఈ ఉప ఎన్నికను తన ఉనికిని చూపించుకునే అవకాశంగా చూస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే కేవలం ఒక సీటు మాత్రమే కాదు … తెలంగాణలో కూటమి శక్తి పరీక్ష. బాబు దృష్టి సూటిగా ఈ సీటుపైనే ఉంది. బీజేపీకి మద్దతు ఇస్తూ టీడీపీ కూడా బలమైన ఎంట్రీకి రెడీ అయింది. నవంబర్ 11న జరిగే ఈ పోలింగ్ తెలంగాణ రాజకీయ దిశను మలచే అవకాశం ఉందని రాజకీయ వర్గాల టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: