ప్రచారాలు కొత్తేమీ కాదు. ఎన్నికల ప్రచారం, వ్యక్తిగత ప్రచారం, పార్టీల ప్రచారం – ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే. అయితే, ఈ మధ్యకాలంలో 'వ్యతిరేక ప్రచారం' అనే పదం కొత్త పుంతలు తొక్కుతోంది. 'అగ్గిపుల్ల - కుక్క తోక... కాదేదీ కవితకు అనర్హం' అన్నట్టుగా, ఈ వ్యతిరేక ప్రచారానికి కూడా ఏ అంశం అతీతం కాకుండా పోయింది. ఒకప్పుడు, ఏదైనా తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే, దానిపై విపక్షాలు గళం విప్పేవి. అప్పుడు ప్రభుత్వం తమ వాదనను వినిపించుకునేందుకు కనీసం సమయం ఉండేది. కానీ, ఇప్పుడా దృశ్యం, రూపం, రుచి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వ్యతిరేక ప్రచారానికి సందర్భం, సమయం అనేది కూడా అవసరం లేదు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా, దానికి అపార్థాలు అంటగట్టి, బురద జల్లడం ఫ్యాషన్‌గా మారింది. ఏది అసలో, ఏది నకిలీనో తెలుసుకునేంత తీరిక కూడా లేకుండా ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు.


కందుకూరు విషాదం నుంచి కర్నూలు ప్రమాదం వరకు... చివరికి తాజా తుఫాను సాయం పైనా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం సాగడం ఈ ధోరణికి నిదర్శనం. ఈ ప్రచారాల టార్గెట్ ఒక్కటే: ప్రభుత్వాన్ని బద్నాం చేయ‌డం, 'స‌ర్కారు ఏమీ చేయ‌డం లేదు' అన్న వాద‌న‌ను బ‌లంగా ప్రజల మధ్యకు తీసుకువెళ్ల‌డం. సోష‌ల్ మీడియా ఈ పనికి ప్రధాన వేదికగా మారింది. నిస్సందేహంగా, ఈ నిరంతర ప్రతికూల ప్రచారం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్న మాట వాస్తవమే. అయితే, ఈ వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే, ప్రజల చేతుల్లోకి ఇప్పుడు ఎన్నో సమాచార మాధ్యమాలు వచ్చాయి. దీంతో ఏది నిజం, ఏది కాదో తేల్చుకునే స్పష్టత వారికి మెరుగవుతోంది.



దీనికి తోడు, ప్రభుత్వం కూడా 'ఫ్యాక్ట్ చెక్' పేరుతో తప్పుడు వార్తలపై ఎప్పటికప్పుడు స్పందిస్తోంది. దీని వల్ల వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయి. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం: "నిజం నిలకడ మీద తెలుస్తుంది". పదే పదే అసత్యాలను ప్రచారం చేస్తే, కాలక్రమేణా ప్రజల్లో వారిపైనే వ్యతిరేకత పెరుగుతుంది. ఫలితంగా, వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, రాజకీయంగా ఇబ్బందుల్లో పడడం ఖాయం. అసత్య ప్రచారం అనేది వారి వ్యతిరేకతను ప్రజల మధ్య మరింత పెంచుతుందే తప్ప, వారికి ప్రయోజనం చేకూర్చదు. అందుకే, రాజకీయ ప్రచారంలో విమర్శ ఉండాలి కానీ, నిజాయితీకి లోపం రాకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: