తెలంగాణలో ఏ పని చేసినా ఒక గ్లాసు మద్యం తప్పనిసరిగా ఉండాల్సిందే అన్నట్టుగా పరిస్థితి మారింది. పెళ్లైనా, పండుగైనా, ఇల్లు కట్టినా, ఓటమి ఎదురైనా... “మందే మాయ!” అన్నట్లుగా ప్రజల జీవనశైలిలో మద్యం ఓ భాగమైపోయింది. రాష్ట్రంలో వైన్‌షాప్ లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకున్నవారి సంఖ్యే ఈ సంగతిని చెబుతోంది. ఇటీవల ప్రభుత్వం కొత్త మద్యం లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరించగా, వాటితోనే దాదాపు రూ.3000 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఇది మద్యం వ్యాపారం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి సరిపోతుంది.


తాజాగా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (CIABC) విడుదల చేసిన నివేదిక ప్రకారం, తెలంగాణ దేశంలో మద్యం వినియోగంలో మూడో స్థానంలో ఉంది. అంటే కర్ణాటక, తమిళనాడుల తర్వాత తెలంగాణ! దక్షిణాది దూకుడు మద్యం అమ్మకాలలో: దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో 40.17 కోట్ల IMFL (India Made Foreign Liquor) కేసులు అమ్ముడయ్యాయి. అందులో కర్ణాటక ఒక్క రాష్ట్రంలోనే 6.88 కోట్ల కేసులు (17%), తమిళనాడులో 6.47 కోట్లు, తెలంగాణలో 3.1 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 3.55 కోట్లు అమ్ముడయ్యాయి. మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాలు కలిసి 58 శాతం మార్కెట్‌ను ఆక్రమించాయి.



ఉత్తరాది వెనకబాటు:ఉత్తరప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రంలో కేవలం 2.5 కోట్ల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. దాంతో యూపీ ఆరో స్థానంలో నిలిచింది. రాజస్థాన్, డిల్లీ, హరియాణా రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాది మద్యం మార్కెట్ అంటే దేశానికి “సప్లయింగ్ ఇంజిన్” అన్నట్టుంది. మహిళలు కూడా మద్యం వైపు: ఇక ఈశాన్య రాష్ట్రాల్లో మహిళల మద్యపానం అధికంగా ఉందని CIABC తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లో 24.2%, సిక్కింలో 16%, అస్సాంలో 7% మహిళలు మద్యం సేవిస్తున్నారని రిపోర్ట్ చెబుతోంది. తెలంగాణలో కూడా 6.7% మహిళలు మద్యం సేవిస్తున్నారని తేలింది. ఆశ్చర్యమేమంటే - పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల మహిళలకే మద్యం అలవాటు ఎక్కువగా ఉందట!



ఆదాయమా – ఆరోగ్యమా? మద్యం అమ్మకాలు రాష్ట్ర ఖజానా నింపుతున్నాయి. కానీ మరోవైపు ప్రజారోగ్య సమస్యలు, కుటుంబ వివాదాలు, ప్రమాదాలు పెరుగుతున్నాయి. నిపుణులు చెబుతున్నట్టు, “మద్యం ఆదాయం తాత్కాలిక లాభం మాత్రమే, కానీ దాని సామాజిక వ్యయం ఎక్కువ” అని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో “మందు కల్చర్” ఇప్పుడు లైఫ్‌స్టైల్‌గా మారిపోయింది. కానీ అదే సమయంలో ప్రజారోగ్య అవగాహన పెంచడం, మద్యం నియంత్రణ విధానాలు బలోపేతం చేయడం — ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: