దేశానికి తిరుగులేని నాయకత్వం అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాజ‌కీయ జీవితానికి, ఆయ‌న ప‌ద‌వికి ముడిపెడుతూ 2025లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా ఆయన 75 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో, మోదీ రిటైర్మెంట్ గురించి మోదీ వ్యతిరేక మీడియా చేపట్టిన ప్రచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మోదీ తప్పుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుకుంటోందంటూ జరిగిన ఈ ప్రచారం... చివరికి 'టీ కప్పులో తుఫాన్‌' మాదిరిగా తేలిపోయింది! మోదీ 75 ఏళ్ల వయస్సును కటాఫ్‌గా తీసుకుని, సెప్టెంబర్ 17 నాటికి ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారన్న ప్రచారాన్ని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వయంగా ఖండించారు. బీజేపీ వ్యవహారాల్లో ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేయడంతో, మోదీ వయస్సును ముడిపెట్టి జరిగిన ప్రచారానికి బ్రేక్ పడింది.
 

అయినప్పటికీ, ప్రత్యర్థులు బీహార్ ఎన్నికల ఫలితాలను అడ్డుపెట్టుకుని మరో కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు. బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఓటమి పాలైతే, ఆయన ఎన్డీఏకు గుడ్‌బై చెప్పి, కూటమి కుప్పకూలుతుందని... దాంతో కేంద్రంలో మోదీ సర్కార్ మైనారిటీలో పడుతుందని ప్రత్యర్థులు గట్టిగా ప్రచారం చేశారు. బీహార్‌లోని ఒక్క ఓటుతోనే కేంద్రంలో అధికారం మారుతుందని కలలు కన్నారు. కానీ, బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆ ప్రచారాలన్నీ పటా పంచల్ అయ్యాయి! బీహార్‌లో బీజేపీ, జేడీయూ కూటమి ఎన్నడూ లేని అద్భుతమైన మెజారిటీని సాధించింది. దీంతో బీహార్ ఫలితాల నుంచి మోదీకి ఎటువంటి ముప్పు లేదని, విపక్షాల ప్రచారం పూర్తిగా అబద్ధమని తేలిపోయింది. బీహార్ వంటి కీలకమైన హిందీ బెల్ట్ రాష్ట్రంలో తిరుగులేని విజయం సాధించిన తర్వాత బీజేపీకి, మోదీకి ఇక తిరుగులేదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

 

ప్రస్తుతం మోదీ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉంటుంది. ఈ విజయం తర్వాత, రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇక ఆయా రాష్ట్రాల అంశంగానే పరిగణించబడతాయి తప్ప, కేంద్రంలో భూకంపం సృష్టిస్తాయన్న ప్రచారం చేయడానికి ప్రత్యర్థులకు అవకాశం లేకుండా పోయింది. బీజేపీ చేతిలో ఇంకా మూడున్నరేళ్ల కాలం ఉంది. ఈ కాలంలో తాము చేయాలనుకున్న ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయాలని ఆ పార్టీ కఠిన నిర్ణయంతో ఉంది. జనగణన, లోక్‌సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల ప్రకారం 2029 ఎన్నికలకు వెళ్లడం వంటి లక్ష్యాలను పెట్టుకుంది. బీజేపీ దృష్టి అంతా ఇప్పుడు 2029 ఎన్నికల్లో గెలవడంపైనే ఉంది. సరైన వ్యూహాలు, అపారమైన అధికార బలం కలగలిపితే... నాలుగోసారి కూడా నరేంద్ర మోదీనే ప్రధానిగా రావాలని బీజేపీ బలంగా ఆశిస్తోంది. మోదీ శకం ముగిసిందన్న వదంతులు ఇక చరిత్రే!

మరింత సమాచారం తెలుసుకోండి: