ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-2021లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై చెన్నై అన్ని విభాగాల్లోనూ అదరగొట్టి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై గెలుపులో ఆ జట్టు పేసర్ దీపక్ చాహర్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనింగ్ స్పెల్ వేసిన చాహర్.. 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్‌ కీలక ఆటగాళ్లు మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, దీపక్‌ హుడా, నికోలస్‌ పూరన్‌ వికెట్లు తీసి ప్రత్యర్థి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దీంతో పంజాబ్ విలవిల్లాడిపోయింది. 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. అయితే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే.

అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహర్ ప్రదర్శన దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన చాహర్.. 9 ఎకానమీతో ఏకంగా 36 పరుగులు సమర్పించుకోవడమే కాకుండా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతడి బౌలింగ్‌పై భారీగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే అతడికి ఓ అభిమాని నుంచి ఓ మెసేజ్ వచ్చిందట. ఆ మెసేజ్‌లో ఉన్న విషయం చాహర్‌కు చాలా బాధ కలిగించిందట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. మ్యాచ్‌ అనంతరం సహచర ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌తో ముచ్చటిస్తూ.. ఢిల్లీ మ్యాచ్‌ ఫలితం తర్వాత సోషల్‌ మీడియాలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు.

‘‘ఆరోజు నేను గదికి వెళ్లిన తర్వాత సోషల్‌ మీడియా చెక్‌ చేసుకుంటున్నా. అప్పుడే ఒక అబ్బాయి నుంచి మెసేజ్‌ వచ్చింది. ‘‘భాయ్‌ మీరు మంచి బౌలర్‌ అని నాకు తెలుసు. అయితే, నాదొక విన్నపం.. మీరు తదుపరి మ్యాచ్‌లో మాత్రం ఆడకండి’’ అని మెసేజ్‌ పెట్టాడు. నిజానికి, ఆటగాళ్ల మీద ఎవరి అంచనాలు వారికి ఉండటం సహజం. ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించాలని కోరుకుంటారు. అందుకే ఆ అబ్బాయి నాకు అలా సందేశం పంపాడు. అయితే, నేను ఒకవేళ ఈరోజు ఆడకపోయి ఉంటే ఇలాంటి ఒక ప్రదర్శన చూసే అవకాశమే ఉండేది కాదు కదా. కాబట్టి ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన చెత్త ప్రదర్శన చేస్తాడన్న ముద్ర వేయకూడదు. అలాంటి వాళ్లకు మద్దతుగా నిలవండి’’ అని దీపక్‌ చాహర్‌ అభిమానులను కోరాడు.

కాగా.. తాను ఎప్పుడూ గొప్పగా ఆడేందుకే ప్రయత్నిస్తానని, అంచనాల మేరకు రాణించేందుకు ఎల్లప్పూడూ కష్టపడతానని, కానీ ఏ ఆటగాడూ ప్రతిసారీ అద్భుత ప్రదర్శనలు చేయలేడని,  కొన్ని సార్లు రాణించలేకపోవచ్చని చాహర్ అన్నాడు. అలాంటి సమయంలో ఆ ఆటగాళ్లకు అభిమానులు అండగా ఉండాలని, అంతేకానీ ఒక్క ప్రదర్శనతో వారి విలువేమిటో నిర్ణయించడం సరికాదని చాహర్‌ అభిప్రాయపడ్డాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: