
గాయపడిన కేశవ్ మహారాజ్ స్థానంలో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన వియాన్ ముల్డర్, తన మొదటి మ్యాచ్‌లోనే విశ్వరూపం చూపించాడు. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 297 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసి, టెస్టుల్లో రెండో వేగవంతమైన 300 రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విధి ఆడిన వింత నాటకంలో 247 పరుగుల వద్ద ఔటైనా, అది నో-బాల్ కావడంతో బతికిపోయాడు. ఇక అక్కడి నుంచి ఆగేదే లేదన్నట్లు చెలరేగిపోయాడు.
టెస్ట్ క్రికెట్‌లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా నెలకొల్పిన 400 పరుగుల అజేయ రికార్డును బద్దలు కొట్టేందుకు ముల్డర్‌కు కేవలం 33 పరుగులు మాత్రమే అవసరం. సౌతాఫ్రికా స్కోరు 626/5 వద్ద ఉండగా, ముల్డర్ 367 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రపంచమంతా అతను ఆ రికార్డును అధిగమిస్తాడని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలో, ఎవరూ ఊహించని విధంగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి అందరికీ భారీ షాక్ ఇచ్చాడు.
ఈ అనూహ్య నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని ముల్డర్ వివరిస్తూ చెప్పిన మాటలు ప్రతీ క్రీడాభిమాని హృదయాన్ని గెలుచుకున్నాయి. "బ్రియాన్ లారా ఒక లెజెండ్.. ఆ స్థానం ఎప్పటికీ ఆయనదే. దశాబ్దాలుగా చెక్కుచెదరని ఆ రికార్డు అలాంటి గొప్ప ఆటగాడి పేరు మీద ఉండటమే దానికి అసలైన గౌరవం. నాకు మళ్ళీ అవకాశం వచ్చినా ఇలాగే చేస్తాను. లెజెండ్స్ రికార్డులను లెజెండ్స్ దగ్గరే ఉండనివ్వమని మా కోచ్ కూడా చెప్పారు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం" అంటూ తనలోని గొప్ప క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు.
ఒక వ్యక్తిగత రికార్డును వదులుకున్నా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను, గౌరవాన్ని గెలుచుకున్నాడు ముల్డర్. రికార్డులు సృష్టించడం గొప్పే.. కానీ లెజెండ్స్‌ను గౌరవించడం అంతకంటే గొప్పదని ఈ యంగ్ కెప్టెన్ నిరూపించాడు.