కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక జట్టు ఓటమి పాలైనప్పటికీ, ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగ మళ్లీ తన అద్భుత బౌలింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హసరంగా మూడు కీలక వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను 248 పరుగులకే కట్టడి చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌ లో మాత్రం హసరంగా తక్కువ స్కోరుతోనే వెనుదిరగాల్సి వచ్చింది. కానీ, అతను ఈ మ్యాచ్‌లో వన్డేల్లో తన 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కేవలం ఒక్క పరుగు వద్ద ఈ ఫీట్‌ను సాధించిన హసరంగా, అదే మ్యాచ్‌లో ఇప్పటికే 100 వికెట్లు కూడా ఉన్న కారణంగా, 1000 పరుగులు + 100 వికెట్లు గల అత్యంత వేగవంతమైన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా లెజెండరీ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్ పేరిట ఉండగా, ఆయన ఈ ఘనతను 68 వన్డేల్లో సాధించాడు. హసరంగా మాత్రం దీన్ని కేవలం 65 మ్యాచ్‌ల్లోనే పూర్తి చేసి అతని రికార్డును చెరిపేశాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. పర్వేజ్ హుసేన్ 69 బంతుల్లో 67 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో అసిత్ ఫెర్నాండో 4 వికెట్లు, హసరంగా 3 వికెట్లు తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను 45.5 ఓవర్లలో 248 పరుగులకే ముగించేశారు.

లక్ష్య చేధనలో శ్రీలంక 48.5 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. జనిత్ లియనాగే 78 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్ తన్వీర్ ఇస్లాం 5/39 తో ఐదు కీలక వికెట్లు తీసి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇలా 3 వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే తుది వన్డే జూలై 9న పల్లెకెలె వేదికగా జరగనుంది. రెండు జట్లూ సమవుజ్జీగా ఉండటంతో, ఫైనల్ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. హసరంగా వరల్డ్ రికార్డు సాధించిన ఈ సందర్భం శ్రీలంక క్రికెట్‌కి గర్వకారణం కాగా, వరుసగా మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు అతని కసి మరింత పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: