అత్యంత అవినీతి ఉద్యోగులు ఉన్న దేశాలలో మన ఇండియా కూడా ఒకటి. కఠిన పనిష్‌మెంట్స్ లేకపోవడం, ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశ వల్ల ప్రభుత్వ ఉద్యోగులు బల్ల కింద చేయి చాపటం ఎప్పటినుంచో ఒక ఆనవాయితీగా వస్తోంది. లంచం లేనిదే ఏ పని జరగని పరిస్థితి ఇండియాలో నెలకొందంటే అతిశయోక్తి కాదు. అందరూ అని కాదు కానీ గవర్నమెంట్ ఉద్యోగులలో చాలామంది అవినీతి తిమింగలాల వలె ప్రజలను పీక్కు తింటున్నారు. వీరిని మౌనంగా కొందరు భరిస్తుంటే, మరికొందరు వారి బండారం బట్టబయలు చేస్తున్నారు. తాజాగా ఒక రైతు ఒక రెవెన్యూ అధికారి లంచగొండితనాన్ని బయటపెట్టాడు.

అయితే రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా సరే అతడు ఆధారాలు లేకుండా తన పరువు కాపాడుకునేందుకు ఎంతగా ప్రవర్తించాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గానూ మారింది. ఈ అవినీతి ఉద్యోగి చేష్టలు చూసి చాలామంది షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం, కట్నీ జిల్లా, బర్కేడా గ్రామంలో నివసిస్తున్న చందన్ సింగ్ లోధి తన సొంత భూమి విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాడు. వీటిని పరిష్కరించాలని గత కొద్ది రోజులుగా రెవెన్యూ ఆఫీస్‌కు వెళుతున్నాడు. అక్కడ రెవెన్యూ ఆఫీసర్ పట్వారీ గజేంద్రసింగ్‌ని సమస్య పరిష్కరించాలని కోరుతున్నాడు.

కానీ అతని ప్రాబ్లమ్‌ను తీర్చకుండా గజేంద్రసింగ్‌ ఆలస్యం చేయడం ప్రారంభించాడు. చివరికి రూ.5,000 లంచం ఇస్తే తప్ప పని జరగదని కొండ బద్దలు కొట్టాడు. దాంతో చందన్ షాక్‌ అయ్యాడు. రూ.5,000 ఎందుకు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగిగా గవర్నమెంట్ నుంచి జీతం పొందడం లేదా అని చందన్ తనలో తానే అనుకున్నాడు. ఇలాంటి అవినీతి జలగలకు సరైన బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుకే ముందుగా లంచం ఇస్తున్నట్లు నటించాడు. సరిగ్గా అదే సమయంలో జబల్‌పూర్ లోకాయుక్త అధికారులను సీన్‌లోకి పిలిపించాడు. దాంతో ఖంగుతిన్న సదరు అవినీతి అధికారికి ఏం చేయాలో పాలు పోలేదు.

లంచం తీసుకున్నట్లు ఆధారాలు కనిపిస్తే బుక్ అవుతామనే భయంతో వెంటనే 5,000 రూపాయల విలువైన నోట్స్‌ను నోట్లో కుక్కుకొని వాటిని నమిలి మింగేసాడు. కానీ ఆ తతంగమంతా రికార్డ్ చేసిన లోకాయుక్త స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ అధికారులు గజేంద్రసింగ్ ని హాస్పిటల్ కి తరలించి నమిలిన నోట్లను బయటకి కక్కించారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన భారతదేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: