తెలంగాణలో కరెంట్ హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పార్టీల రాజకీయాలన్నీ కరెంట్ పైనే నడుస్తున్నాయి. ఏ పార్టీ చూసినా కరెంట్ సమస్యనే లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న త్రిముఖ పోరులో మూడు పార్టీలు కరెంట్ అంశాన్ని ప్రస్తావిస్తూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయి.


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 3 గంటలే కరెంట్ ఇస్తోందని.. మళ్లీ పాత రోజులే వస్తాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ అంశంపైనే ఎక్కువగా ప్రచారం చేస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అక్కడి ప్రజలకు ఏం చేయలేదని… వాళ్ల కరెంట్ కష్టాలు అలాగే ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే 24 గంటల విద్యుత్తు ఉండదని రైతులు మళ్లీ కష్టపడాల్సిన పరిస్థితి వస్తోందని ప్రతి సభలో సీఎ కేసీఆర్ హస్తం పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు కొనసాగిస్తున్నారు.


దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా గట్టిగానే బదులిస్తున్నారు. అధికార  పార్టీ 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఉచితం కరెంట్ ప్రవేశ పెట్టిందే తమ పార్టీ అని..  ఉచిత కరెంట్ పేటేంట్ మాదే నని స్పష్టం చేస్తోంది.  మరోవైపు రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కచ్ఛితంగా నిరంతర విద్యుత్తు ఇస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా పదేళ్లలో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశానని చెబుతున్నారు.  తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శం అని ఊదరగొడుతున్నారు.  మరి ఆ మోడల్ గురించి ప్రస్తావించి ఓట్లడగకుండా కాంగ్రెస్ పై దుష్ప్రచారం ఎందుకు అని ప్రశ్నించారు.


రూ.వందల కోట్లు ఖర్చు పెట్టి పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు. భయంతో విచక్షణ కోల్పోయి స్థాయి మరచి మాట్లాడు తున్నారన్నారు. ఇన్నేళ్లు అధికారంలో ఉన్నా చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రజలను తప్పు దోవ పట్టించేందుకే సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: