ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. గడిచిన మార్చిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడగా, అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం లో మునిగి తేలాయి. కొన్నిచోట్ల ఏకగ్రీవాలు అవ్వడం , ఎన్నికల పోలింగ్ అతి దగ్గరలో ఉండగానే .... అకస్మాత్తుగా ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అప్పట్లో ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. కరోనా వైరస్ ప్రభావం ఇంకా ప్రారంభ దశలో ఉండగానే, దాని బూచిగా చూపించి ఎన్నికలు వాయిదా వేయడం కరెక్ట్ కాదని , ఎన్నికల కమిషన్ ను నిలదీసింది. అంతేకాకుండా ప్రధాన రాజకీయ పార్టీలను మాట మాత్రం గా అయినా సంప్రదించకుండా, అసలు ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారని నిలదీసింది. ఈ వ్యవహారం ఇలా ఉండగానే, అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో, ఈ సంగతి అంత పక్కన పెట్టేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గలేదు.ఆ  ప్రభావం ఇప్పటికీ ఉంది ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా, ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమవడం, ఈ మేరకు హై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. 



ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నిమ్మగడ్డ హైకోర్టుకు తెలపడంతో, ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని,  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి సేకరించిన అభిప్రాయాలు , ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని వివరిస్తూ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేము అని, ఇప్పటికే అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ సిబ్బంది వైరస్  ప్రభావానికి గురి అయ్యారని,  రాబోయేది శీతాకాలం కనుక కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి అని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వివరణ ఇచ్చింది. వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను, ప్రభుత్వ అభిప్రాయాన్ని అన్నిటిని హైకోర్టుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. 



తన అభిప్రాయాన్ని కూడా జతచేసి అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా గతంతో పోలిస్తే ఏపీలో కరోనా వైరస్ ప్రభావం బాగా తగ్గిందని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరును, హైకోర్టుకు నివేదించడంతో , ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుదలతో ఉన్నారు. అవసరమైతే కేంద్ర బలగాల రక్షణలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఉద్దేశ్యంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఏవి ఏమైనా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది పెద్ద మొత్తంగానే కనిపిస్తోంది ఈ వ్యవహారాల్లో ఎవరి మాట నెగ్గుతుంది అనేది కోర్టులే తేల్చాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: