
గడిచిన 24 గంటల్లో భారతదేశంలో కరోనా వైరస్ వల్ల 4,529 మంది మరణించారు. కొత్తగా 2,67,334 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దక్షిణాసియా దేశం మొత్తం సంఖ్య ఇప్పుడు 25.5 మిలియన్లుగా ఉంది. ఇది యునైటెడ్ స్టేట్స్ తరువాత రెండవది. దేశంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య మొత్తం 2,83,248గా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు బుధవారం వెల్లడించాయి. కరోనావైరస్ సెకండ్ వేవ్‌ను కట్టడిచేసేందుకు దక్షిణాసియా దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ సంస్థ పలువురు గ్లోబల్ లీడర్లపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మోడీ మొత్తం రేటింగ్స్ 63శాతంగా నమోదైంది. ఇది యుఎస్ సంస్థ ట్రాక్ చేయడం ప్రారంభించినప్పటి నుండి కనిష్ట స్థాయి కావటం గమనార్హం.
2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ తనదైన పాలనతో ప్రజాదరణ పొందారు. ఫలితంగా 2019లో తిరిగి భారీ మెజార్టీతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో గడిచిన 30యేళ్లలో ఏనేతకు ప్రజల్లో ఇంత ఇమేజ్ రాలేదు. కానీ ప్రస్తుతం మోదీపై వ్యతిరేఖత మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. సెకండ్ వేవ్‌లో భారీఎత్తున కొవిడ్ కేసులు నమోదు కావడానికి కారణం మోదీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటమేనని మార్నింగ్ కన్సల్ట్ ట్రాకర్ తెలిపింది.ముఖ్యంగా న్యూఢిల్లీ వంటి పెద్ద పట్టణ కేంద్రాల్లో ఆస్పత్రుల్లో పడకలు, ప్రాణాలను రక్షించే ఆక్సిజన్ కొరత ఏర్పడటం, ప్రజలు పార్కింగ్ స్థలాల్లోనే మరణించడం, మృతదేహాలు శ్మశానవాటికల్లో పోగుపడటం వంటి అంశాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్న భావనకు ప్రజలు వచ్చారు.
పోలింగ్ ఏజెన్సీ యుగోవ్ ఈ నెలలో పట్టణ భారతీయుల మధ్య జరిపిన ఒక సర్వేలో కరోనా సంక్షోభాన్నిఅడ్డుకోవటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్న భావన ప్రజల నుంచి వెల్లడైంది. ఈ ఏడాది ఫిబ్రవరి సెకండ్ వేవ్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్న వాదనలు వినిపించాయి. ఫలితంగా ఏప్రిల్ చివరి నాటికి 59శాతం మంది మాత్రమే ప్రభుత్వం సంక్షోభాన్ని కొంతమేర ఎదుర్కోగలిగిందన్న భావనను వ్యక్తపర్చారు. అయితే మొదటి వేవ్ సమయంలో 89శాతం మంది మోదీ కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అయితే 2024 వరకు మోడీ జాతీయ ఎన్నికలను ఎదుర్కొనేది లేదు. అతను ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ తన అధికారానికి విశ్వసనీయమైన సవాలును ఇంకా ఎదుర్కోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.