ఏపీలో ఏ తప్పు జరిగినా అది టీడీపీ వాళ్ల పనే అని వైసీపీ వాళ్లు అంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అత్యాచారాలు, పదో తరగతి పేపర్ల లీకేజీల విషయంలో వైసీపీ ఇదే తరహాలో ఎదురు దాడి చేసింది. అంత వరకూ ఓకే.. కానీ ఇప్పుడు గడప గడపకకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎదురవుతున్న నిలదీతల్లోనూ టీడీపీ కుట్రే ఉందంటున్నారు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెబుతున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు.


ఈ కార్యక్రమంలో టీడీపీ వారి ఇంటికీ వెళ్లాలని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు ఆదేశించారని.. గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీ కి చెందిన వారింటికీ వెళ్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి వివరించారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తల ఆశీస్సులు కూడా ఎమ్మెల్యేలు కోరుతున్నారని.. అయితే టీడీపీ ప్రోద్భలంతో కొందరు సంక్షేమ పథకాలకు అర్హత లేకపోయినా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. ఈ దృశ్యాలను  వీడియోలు తీసి ప్రచారం చేస్తున్నారని.. ఎమ్మెల్యేలను నిలదీస్తున్న వారు  తెదేపా కార్యకర్తలేనని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.


గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉండగా ఎవరూ  ఇంటింటికీ వెళ్లలేకపోయారని.. సంక్షేమం,అభివృద్ధి జరుగుతుంటే కడుపు మంట తట్టుకోలేక తెలుగుదేశం నిరసన అని క్రియేట్ చేస్తోందని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. మూడేళ్లలో ఇంత చేస్తున్నాం కాబట్టే గడపగడపకు వెళ్లగలుగుతున్నామని.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ అసంతృప్తితో లేరని.. సీఎం జగన్ రాగానే అన్ని చోట్లా అవినీతి లేకుండా కట్టడి చేశారని సజ్జల రామకృష్ణా రెడ్డి వివరించారు.


అభివృద్ధి చూడాలంటే ఓడిపోయిన తెలుగు దేశం నేతలు, అభ్యర్థులను కార్యక్రమానికి  పంపాలని.. దమ్ము ధైర్యం ఉంటే జరుగుతున్న వాటన్నిటినీ వీడియో చేసి పెట్టాలని సజ్జల రామకృష్ణా రెడ్డి సవాల్ విసిరారు. అర్హత ఉండి సహాయం పొందలేని కౌలు రైతులంటూ ఎవరూ లేరని.. వ్యవసాయ మోటార్లకు  మీటర్లకు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామనేది లక్ష సార్లు చెప్పామని.. వ్యవసాయ మీటర్లు బిగింపు వెనుక డొంక తిరుగుడు ఏదీ లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: