రవిప్రకాష్‌.. తెలుగు టీవీ జర్నలిజానికి గ్లామర్‌ తీసుకొచ్చిన జర్నలిస్టు.. టీవీ9 స్థాపించి టీవీ జర్నలిజాన్ని పరుగులు పెట్టించిన జర్నలిస్టు. అదే సమయంలో ఆయనపై ఎన్నో విమర్శలు కూడా ఉన్నాయి. అయితే.. ఆ తర్వాత కాలంలో ఆయన అదే టీవీ9 నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అదే టీవీ9 వ్యవహారంలో ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా తెరపైకి రాని రవిప్రకాష్‌.. ఇటీవల RTV అనే డిజిటల్ ఛానల్‌ ప్రారంభించారు.


అలాంటి RTV ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు తాము ఓ స్టడీ నిర్వహించామంటూ ఏపీ, తెలంగాణ ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. దీనిపై రవిప్రకాష్‌ స్వయంగా రోజూ ఒక్కో ప్రాంతం ఫలితాలను వివరిస్తూ షోలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి కూటమే విజయం సాధిస్తుందని తన స్టడీలో రవిప్రకాష్‌ తేల్చి చెప్పారు. వైసీపీ కేవలం 63 సీట్లకు పరిమితం అవుతుందని.. కూటమి 111 స్థానాలు గెలుచుకుంటుందని రవిప్రకాష్ అంచనా వేశారు.


అయితే.. ఈ సర్వేపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇది రవిప్రకాష్‌ తన సామాజిక వర్గం కోసం చంద్రబాబుకు చేస్తున్న సాయం అని సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌ చెబుతున్నారు. ఎన్నికలకు ముందు తన సామాజిక వర్గాన్ని ఉపయోగించుకుని ఇలాంటి జిమ్మిక్కులు చేయడం అలవాటే అంటూ పాత విషయాలు గుర్తుచేశారు. 2018-19లో ఇలాగే లగడపాటి సర్వే అంటూ మళ్లీ చంద్రబాబే అధికారంలోకి వస్తున్నారని చెప్పించిన విషయాన్ని గుర్తు చేశారు.


ఇదే సమయంలో దేవులపల్లి అమర్‌ ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. 2019 ఎన్నికలకు ముందు విజయవాడ ఎయిర్‌పోర్టులో రవిప్రకాష్‌ దేవులపల్లి అమర్‌కు ఎదురయ్యారట. ఏంటి ఏపీలో ఎలా ఉంది  పరిస్థితి అని అమర్‌ను అడిగారట. ఆయన ఈసారి జగన్‌ గెలవబోతున్నారని అమర్ అంటే.. రవిప్రకాష్ షాకయ్యారట. అసలు జగన్‌ గెలుస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు.. అది అసాధ్యం అని చెప్పారట. కానీ.. ఎన్నికల్లో జగన్ బంపర్‌ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే కదా. అలా ఉంటుంది రవిప్రకాష్ అంచనా అని అమర్‌ పాత విషయం బయటపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: