
ఈ పరిస్థితికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి నాయకులు తాము చేసే తప్పులు గ్రహించుకొని మారతారని చంద్రబాబు నమ్మకం. రెండోది తప్పులు చేస్తున్న వారందరి స్థాయి పెద్దదే కావడంతో, వారిపై కఠిన చర్యలు తీసుకుంటే పార్టీకి ఇబ్బందులు వస్తాయనే ఆందోళన. ఈ రెండు కారణాల వల్ల ఆయన నిర్ణయాత్మకంగా ముందుకు సాగలేకపోతున్నారు. దీంతో నాయకులు మరింత పేట్రేగి పోతున్నారు. నాయకుల్లో ఈ ధోరణి వల్ల తప్పులు మరింత పెరుగుతున్నాయి. గతంలో వైసీపీ నేతలు తప్పు చేసినప్పుడు జగన్ వారిని కాపాడిన ఉదాహరణలు ఉన్నాయి. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో జగన్ నిశ్శబ్దంగా ఉండడం గుర్తు. కానీ చంద్రబాబు మాత్రం అప్పటి నుంచే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయినా సరే, కఠిన చర్యలు లేకపోవడం వల్ల ఆయన హెచ్చరికలు అందరూ లైట్ తీస్కొంటున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి నష్టం తప్పదని సీనియర్ నాయకులు హెచ్చరిస్తున్నారు. తప్పులు చేసిన వారిని వదిలేయకుండా కఠినంగా ఎదుర్కొంటేనే తప్పు చేయడానికి ఎవరూ సాహసించరు. లేకపోతే పార్టీ క్రమశిక్షణ దెబ్బతింటుంది. చివరికి, తమ్ముళ్ల తప్పుల విషయంలో చంద్రబాబు మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ దూకుడును చూపించాల్సిన అవసరం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.