మనలో చాలామంది కూరలో కరివేపాకు ఉంటే సైడ్ పెట్టేస్తారు. “దీనివల్ల ఏమవుతుంది?” అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ అదే కరివేపాకు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతటి ఆదాయం తెస్తోందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేవలం ఐదు రూపాయల కట్టగా అమ్మే ఈ ఆకు వెనక కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని చాలా మందికి తెలియదు. అంతేకాదు.. కరివేపాకు ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా ఏపీ ఖాతాలో చేరుతోంది. గుంటూరు జిల్లా పెదవడ్లపూడి గ్రామం నుంచే కరివేపాకు వాణిజ్య సాగుకు శ్రీకారం చుట్టారు. అక్కడి రైతులు ఈ పంటలో మంచి ఆదాయం సాధించడంతో రాష్ట్రంలోని ఇతర జిల్లాల రైతులు కూడా సాగు చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం గుంటూరు, అనంతపురం (తాడిపత్రి, పెద్దపప్పూరు), ప్రకాశం జిల్లా దర్శి, వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో పెద్ద ఎత్తున సాగు జరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 3,000 ఎకరాల్లో కరివేపాకు సాగు జరుగుతుండగా, అసలు విస్తీర్ణం మరింత ఎక్కువగానే ఉందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.


ఒక ఎకరానికి సంవత్సరానికి దాదాపు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. కానీ ఆ ఎకరంలో ఏడాదికి 20 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మెట్రిక్ టన్ను ధర సీజన్‌ను బట్టి మారుతుంది – నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు ధరలు గరిష్టంగా రూ.30,000 – రూ.40,000 ఉంటే, మిగతా కాలంలో రూ.10,000 – రూ.30,000 మధ్య ఉంటుంది. అంటే, కరివేపాకు పంట రైతులకు రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తూ, స్థిరమైన ఆదాయ వనరుగా మారింది. దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా డిమాండ్ .. ఏపీలో పండిన కరివేపాకు రోజూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబయి వంటి నగరాలకు లారీ లారీలుగా వెళ్తోంది. ఒక్కో లారీ 4 టన్నుల కరివేపాకు తీసుకెళ్తుంది. ఇటీవల కాలంలో దుబాయ్‌కి కూడా భారీ ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా కరివేపాకు డిమాండ్ పెరుగుతుండటంతో రైతులకు మరింత లాభాలు వస్తున్నాయి.



మేజిక్ పంట .. కరివేపాకులోని అసలైన మేజిక్ ఏమిటంటే .. ఒకసారి విత్తు వేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. అంటే దీర్ఘకాలం పాటు ఎటువంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేకుండా స్థిరమైన ఆదాయం వచ్చే పంట. అందుకే కరివేపాకును “గ్రీన్ గోల్డ్” అంటారు. కూరలో సైడ్ పెట్టే ఆ ఆకే ఏపీ రైతుల జీవితాలను మార్చేస్తోంది. సూపర్ మార్కెట్లు, హోటళ్లు, గృహాలు – ఎక్కడైనా డిమాండ్ పెరుగుతూనే ఉంది. కరివేపాకు సాగుతో రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుండటమే కాకుండా, రైతులకు స్థిరమైన భవిష్యత్తు కూడా లభిస్తోంది. ఇకపై కూరలో కరివేపాకు కనిపిస్తే.. వృధా అనిపించదు, “ఇది గోల్డ్ ఆకులే” అనిపిస్తుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: