గంప గోవర్ధన్...టీఆర్ఎస్‌లో కీలక నేత. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దశాబ్దాల కాలం నుంచి రాజకీయాలు చేస్తున్న నాయకుడు. అసలు మొదట టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గంప గోవర్దన్...1994 ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసి విజయం అందుకున్నారు. అయితే 1999లో గంపకు సీటు దక్కలేదు. ఇక 2004 ఎన్నికల్లో టీడీపీ పొత్తులో భాగంగా కామారెడ్డి సీటు బీజేపీకి దక్కడంతో పోటీ చేయడం కుదరలేదు.

అయితే గంపకు ఎల్లారెడ్డి సీటు దక్కింది. కానీ వైఎస్సార్ వేవ్‌లో ఓటమి పాలయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో మళ్ళీ కామారెడ్డి వచ్చి పోటీ చేసి గెలిచారు. అయితే నిదానంగా తెలంగాణ ఉద్యమం ఉదృతం అవ్వడం..టీడీపీ వీక్ అవుతూ ఉండటంతో గంప టీడీపీని వదిలి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012 ఉపఎన్నికలో పోటీ చేసి గెలిచారు.

ఇక 2014, 2018 ఎన్నికల్లో వరుసగా టీఆర్ఎస్ నుంచి గెలిచి సత్తా చాటారు. అయితే రెండుసార్లు కూడా మంత్రి పదవి వస్తుందని గోవర్ధన్ ఆశించారు. కానీ పదవి రాలేదు. అయితే 2018 ఎన్నికల్లో గెలిచిన మొదట్లో పదవి రాలేదని చెప్పి కాస్త యాక్టివ్ గా పనిచేయలేదు. చివరికి విప్ పదవి దక్కడంతో యాక్టివ్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. పూర్తిగా నియోజకవర్గంపై పట్టు ఉండటంతో కామారెడ్డిలో గంప బలమైన నేతగా ఉన్నారు. అలాగే ప్రజల మధ్యలోనే ఉంటూ..వారి సమస్యలని పరిష్కరించడంలో గోవర్ధన్ ముందు ఉన్నారు.

దీంతో కామారెడ్డిలో గంపకు తిరుగులేకుండా పోయింది. అయితే గంపకు ప్రత్యర్ధిగా కాంగ్రెస్ సీనియర్ షబ్బీర్ అలీ పనిచేస్తున్నారు. వరుసగా గంపపై ఓడిపోతూ వస్తున్నారు. ఈ సారి మాత్రం గెలవాలనే కసితో అలీ పనిచేస్తున్నారు. ఓడిపోయిన సానుభూతి అలీపై ఉంది...కానీ గంప కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. మరి చూడాలి ఈ సారైనా గంపకు అలీ చెక్ పెట్టగలరో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: