భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ గొప్ప న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్‌. ఆయ‌న‌ విల‌క్ష‌ణ న‌టుడు మాత్ర‌మే కాదు. సినిమాల్లో ఆయ‌న చేసిన ప్ర‌యోగాలు ఆ స్థాయి స్టార్‌డ‌మ్ ఉన్న న‌టులెవ‌రూ ఎంత‌మాత్రం చేయ‌డానికి సాహ‌సించ‌నివి. డ‌బ్బు సంపాద‌న మాత్ర‌మే త‌న ల‌క్ష్యం కాదంటూ వెండితెర‌పై వినూత్న‌ ప్ర‌యోగాల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డం క‌మ‌ల్‌కు మాత్ర‌మే సాధ్య‌మైన విష‌యం. ఇలాంటి ప్ర‌యోగాల్లో భాగంగానే దాదాపు మూడు ద‌శాబ్దాల క్రితం క‌మ‌ల్‌హాస‌న్ త‌న డ్రీమ్ ప్రాజెక్టుగా పేర్కొంటూ మ‌రుద‌నాయ‌గం అనే పీరియాడిక‌ల్ మూవీని అప్ప‌టి లెక్క‌ల ప్ర‌కారం అత్యంత భారీ వ్య‌యంతో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేశాక అక్క‌డినుంచి కోలీవుడ్ కు తిరిగివ‌చ్చి ఉత్త‌రాదివారు కూడా అబ్బుర‌ప‌డే స్థాయి సినిమాల‌ను తాను చెన్నై నుంచే చేసి చూపిస్తాన‌ని చెప్పి క‌మ‌ల్‌ త‌ల‌కెత్తుకున్న ప్రాజెక్టు ఇది.   1991లో అనౌన్స్ చేసిన ఈ సినిమా స్క్రిప్టు వ‌ర్క్ పూర్తి చేసుకుని షూటింగ్ మొద‌లు పెట్ట‌డానికి దాదాపు ఆరేళ్లు ప‌ట్టింది. 1997లో క‌మ‌ల్ హాస‌న్ హీరోగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో సొంత బ్యాన‌ర్ రాజ్‌క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ప‌తాకంపై ఈ సినిమాను ప్రారంభించారు.

          ఓ ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ‌ చిత్ర నిర్మాణ సంస్థ దీనికి స‌హ నిర్మాత‌గా ఉండేందుకు ముందుకు వ‌చ్చింది. ఇక  చెన్నైలో జ‌రిగినఈ చిత్రం ప్రారంభోత్స‌వానికి బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజ‌బెత్‌ అతిథిగా వ‌చ్చారంటే క‌మ‌ల్ ఈ చిత్రాన్ని ఎంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారో.. దీనికి ఎంత‌టి ప్ర‌చారం ల‌భించిందో అర్థం చేసుకోవ‌చ్చు. ప‌లు ఇత‌ర భాషా న‌టులు కూడా ఈ చిత్రంలో ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల కోసం ఎంపిక‌య్యారు. విష్ణువ‌ర్థ‌న్‌, అమ్రీష్‌పురి, న‌సీరుద్దీన్‌షా, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్ త‌దిత‌రులు ఈ లిస్టులో ఉన్నారు. కొంత భాగం చిత్రీక‌ర‌ణ కూడా జ‌రుపుకుంది. అప్ప‌ట్లో విడుద‌లైన ఈ చిత్రం ట్రైల‌ర్ ఈ చిత్రంపై అంచనాల‌ను మ‌రింత పెంచింది. అయితే ఎందుక‌నో ఈ చిత్రానికి ఆది నుంచి క‌ష్టాలే ఎదుర‌య్యాయి. భారీ బ‌డ్జెట్ మూవీ కావ‌డంతో క‌మ‌ల్‌హాస‌న్‌కు ఈ చిత్రంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌య్యాయి. ఈ చిత్రం కోసం ఇత‌ర చిత్రాలను సైతం క‌మ‌ల్ ఒప్పుకోక‌పోవ‌డంతో ఆయ‌న‌కు మ‌రిన్ని క‌ష్టాలు త‌ప్ప‌లేదు. నెల‌ల త‌ర‌బ‌డి షూటింగ్ డిలే కావ‌డంతో కో ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించేందుకు ఒప్పుకున్న మ‌రోసంస్థ మ‌ధ్య‌లోనే కాడి ప‌డేసింది. ఇక ఆ త‌రువాత అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మొద‌లుపెట్టిన  ఆ సినిమా ఏమైందో ఎవ‌రికీ తెలియ‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: