
పుష్ప జాతుల్లో మల్లెపూవులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అటు శుభకార్యాలలో.. దేవాలయాల్లో అన్ని సందర్భాలలో కూడా ఎక్కువగా అలంకరణకు ఉపయోగించే మల్లెపూలు మగువలు మెచ్చిన మల్లెపూలు అని చెప్పవచ్చు. ఇకపోతే వేసవికాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మల్లెపూలను ఇష్టపడని వారంటూ బహుశా ఎవరు ఉండరేమో.. అందుకే మల్లెపూలకు నిత్యం డిమాండ్ ఉంటుంది.. కాబట్టి దీనినే మీరు చక్కటి వ్యాపార అవకాశంగా మార్చుకుంటే మంచి ఆదాయాలను పొందవచ్చు.
అసలే ఎండాకాలం ఇప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.. కాబట్టి మీరు మల్లెతోట వేయడానికి ఒక ఎకరం పొలంను ఏర్పాటు చేస్తే సరిపోతుంది.. దీనికి నీరు పెద్దగా అవసరం ఉండదు. నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలలో కూడా మల్లెతోట చిగురిస్తుంది. కేవలం వారానికి ఒకసారి తడి పెడితే చాలు మల్లెతోట చిగురిస్తుంది. ఇకపోతే మీరు మల్లె తోటను వేయాలనుకుంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మొక్కలు తెచ్చుకోవచ్చు.. లేదా మేలు రకం జాతులు కావాలనుకుంటే రాజమండ్రి సమీపంలోని కడియం నర్సరీల నుంచి మొక్కలను తెచ్చుకోవచ్చు.
మొక్కకు మొక్కకు 90 సెంటీమీటర్ల దూరం ఉండేలా గుంతలు ఏర్పాటు చేసి.. ముందుగానే శిలీంద్ర నాసిని ఎరువులను గుంతలో వేసి ఆ తర్వాత మొక్కలు నాటుకోవాలి. ఇలా ఒక్కో మల్లె మొక్క 12 సంవత్సరాల వరకు దిగుబడి అందిస్తుంది. కాబట్టి ఈ వ్యాపారం మీకు మంచి ఆదాయాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.