కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్లు, డైరెక్టర్లు ఇతర టెక్నీషియన్ల సంగతి బాగానే ఉంది కానీ.. సగటు సినీ కార్మికుడు మాత్రం లాక్ డౌన్ కారణంగా నలిగిపోతున్నాడు. రెండు నెలలుగా పనులు లేక.. పస్తులుండాల్సిన పరిస్థితి. సినీ రంగంలో అంతా బావున్నప్పుడే వారికి దొరికే ఉపాధి అంతంత మాత్రం. అలాంటిది.. ఏకంగా రెండు నెలలుగా పని లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. అందుకే వీరిని ఆదుకునేందుకు సినీరంగం కాస్త ప్రయత్నం చేస్తోంది.

 

 

చిరంజీవి ఆధ్వర్యంలోని సీసీసీ కొంత వరకూ ఆదుకుంది. ఇలాంటి సమయంలో ఓ తెలంగాణ మంత్రి తన సొంత నిధుల నుంచి కార్మికులను ఆదుకుంటానని ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆయనే సినిమాటో గ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించడం సంతోషదాయకమనే చెప్పాలి.

 

 

సినీపరిశ్రమలో లాక్ డౌన్ సంక్షేమం గురించి చర్చించేందుకు వచ్చిన మంత్రి.. ఆ తర్వాత స్వయంగా ఈ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి మంత్రి అన్నమాట నిలబెట్టుకుంటే 14 వేల కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసే అవకాశం ఉంది. అలాగే తెలుగు చలన చిత్రపరిశ్రమ సమస్యలను త్వరగా పరిష్కరించి షూటింగులకు అనుమతి ఇస్తే.. కళాకారులు, కార్మికులు చాలా వరకూ సంతోషిస్తారు.

 

 

జూబ్లీహిల్స్ లోని ప్రముఖ సినీనటులు, పద్మభూషణ్ చిరంజీవి నివాసంలో చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పలువురు నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. పరిశ్రమలోని అన్ని వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని సినీమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకునేందుకు, సినిమా దియేటర్ లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: