
సినిమా ఎన్ని గంటలో పక్కన పెడితే.. ఈ ఒక్క పాటలోనే రామ్ జీవితం ఏంటో తెలిసిపోతుంది ప్రేక్షకుడికి. సిరివెన్నెల గోవింద్ వసంత అందించిన సంగీతం, ప్రదీప్ కుమార్ గాత్రం ఈ పాటకు ఓ రూపం ఇస్తే.. సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం ప్రాణం పోసింది. ఏ ముహూర్తాన ఈ పాటకు ‘లైఫ్ ఆఫ్ రామ్’ అని పేరు పెట్టారో కానీ.. ఇది నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో ఒకానొక సమయపు జ్ఞాపకాలను అలా మెలిపెట్టి వదులుతుంది. అంత గొప్ప సాహిత్యాన్ని అందించారు సిరివెన్నెల.
రామ్.. ఒంటిరిగా జీవించాడానికి ఇష్టపడతాడు. ఒంటరిగానే గమ్యం లేని ప్రయాణం చేస్తుంటాడు. తన చుట్టూ ఏముందో పట్టించుకోవడం ఏనాడో వదిలేశాడు. నిరాశ నిండిన జీవితంతో ముందుకు సాగిపోతుంటాడు. ప్రేయసి ఎడబాటుతో మనసును రాయిగా మార్చుకుని, ఆమె గురించే కలలు కంటూ జీవిస్తుంటాడు. తనకు అలా జీవించడమే ఇష్టం. మిగిలిన జీవితం మొత్తం అలానే జీవించాలనుకుంటుంటాడు. అయితే అదే సమయంలో తనను ఏ విధంగానూ మార్చవద్దని తన చుట్టూ ఉండే ప్రకృతిని కోరుతుంటాడు. తాను ఒంటరినని మళ్లీ మళ్లీ అనుకోవద్దని, తన ప్రేయసి జ్ఞాపకాలు జీవితం మొత్తానికి సరిపడా తోడుగా ఉన్నాయని చెబుతుంటాడు. అవే తనను ఇప్పటివరకు నడిపించాయని, ఇక ముందు కూడా అవే తాను జీవించేందుకు కావలసిన ప్రోత్సాహాన్నిస్తాయని రామ్ అభిప్రాయం. తన ప్రతి శ్వాసలోనూ ఆమే ఉందని, ప్రతి సవ్వడిలోనూ ఆమె జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నాయని అంటాడు.
‘‘ప్రతి ఉదయం కొత్తగా జన్మిస్తుంటా. నాకు నిన్నటితోటి సంబంధం లేదు. రేపటితోటి అవసరం లేదు. ప్రతి రోజూ కొత్త కాలంలో అడుగుపెడుతూ.. నా కథను ‘అనగనగా..’ అని మొదలు పెడతాను. నా కథకు అంతమే లేదు. నాకు ఓ చిరునామా లేదు. గాలి వాటంలా ఎక్కడెక్కడో తిరుగుతుంటాను. అలా తిరిగుతూనే తనలోని బాధను గుర్తు చేసుకుని మౌనంగా ఆవేదన చెందుతుంటాను.
నాకింకెవరూ అవసరం లేదు. నాకు.. నేను, నా నీడ వరకు చాలు. నా ఏకాంత లోకంలో నేను బతుకుతున్నాను. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు, తాను కొత్త ఆశల కోసం ఎదురు చూసినప్పుడు ప్రతి సారీ ఆ జాబిలి తనకు ఎప్పుడూ దూరంగా ఉంది. కానీ అక్కడ నుంచే తనకు తోడుగా వెన్నెల హాయిని పంచింది. ఆ జాబిలి తన ప్రేయసి అయితే.. ఆ జాబిలి పంచే వెన్నెల ఆమె ప్రేమ. ఆ ప్రేమ తనతో ఉన్నంత వరకు తాను ఎన్నటికీ ఒంటరి కాను’’ అని హీరో చెబుతుంటాడు.