ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ‌లో ఇవాళ అఖండ చిత్ర‌బృందం సంద‌డి చేసిన‌ది. ఇంద్ర‌కిలాద్రి దుర్గ‌మ్మ‌ను నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, అగ్ర‌ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీ‌ను ద‌ర్శించుకున్నారు.  ఇంద్ర‌కిలాద్రీపై అమ్మ‌వారికి వారు ప్ర‌త్యేక పూజ‌లు చేసారు. ముఖ్యంగా  ద‌ర్శ‌నానికి బాల‌కృష్ణ సంప్ర‌దాయ దుస్తుల‌తో  వ‌చ్చారు. అమ్మ‌వారికి పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం బాల‌య్య మీడియాతో ముచ్చటించారు.

అఖండ చిత్రం విజ‌యం సాధించ‌డంతో సినీ ప‌రిశ్ర‌మ‌కు ఒక ధైర్యము వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌న విజ‌యం సాధించ‌టం ప‌ట్ల చాలా ఆనందంగా ఉన్న‌ద‌ని తెలిపారు బాల‌కృష్ణ‌. స‌నాత‌న ధ‌ర్మాన్ని చూపించిన సినిమా అఖండ అని..  విజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ఆశీస్సుల‌తో ప్రేక్ష‌కులు ఘ‌న విజ‌యం అందించారు అని చెప్పారు.  చాలా రోజుల త‌రువాత సినిమా ప్రేక్ష‌కులంద‌రూ క‌లిసి స‌కుటుంబ స‌మేతంగా థియేట‌ర్ల‌కు ర‌ప్పించిన సినిమా అఖండ అని వెల్ల‌డించారు.

అఖండ విడుద‌లై విజ‌య సాధించిన త‌రువాత త‌న‌కు చాలా ధైర్యం వ‌చ్చింద‌ని.. మంచి క‌థ న‌చ్చి.. కుదిరితే త‌ప్ప‌కుండా మ‌ల్టీస్టార‌ర్ చేస్తాను అని చెప్పారు నంద‌మూరి న‌ట సామ్రాట్‌. అదేవిధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టికెట్ విధానంపై చిత్రం విడుద‌ల‌కు ముందు చ‌ర్చించామ‌ని, ఏపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామ‌ని పేర్కొంటున్న‌ది. ఏమి జ‌రుగుతుందో వేచి చూద్దామ‌ని తెలిపారు బాల‌కృష్ణ‌. త‌ప్ప‌కుండా చిత్ర ప‌రిశ్ర‌మను కాపాడుతామ‌ని.. ఇప్ప‌టికే నిర్మాత‌లు ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని గుర్తు చేసారు.

అంతుకు ముందు విజ‌య‌వాడ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో నంద‌మూరి హీరో బాల‌కృష్ణకు, అఖండ  చిత్ర బృందానికి బొర్రా గాంధీ, క‌రుణాక‌ర్ బృందం స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌రువాత రోడ్డు మార్గంలో అక్క‌డి నుంచి విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేరారు. ఈ త‌రుణంలో బాల‌య్య‌తో ప‌లువురు అభిమానులు సెల్పీలు తీసుకునేందుకు ఎగ‌బ‌డ్డారు. ఇక అక్క‌డి నుంచి నేరుగా విజ‌య‌వాడ దుర్గ‌మ్మ గుడికి వెళ్లి అమ్మ‌వారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజలు నిర్వ‌హించారు అఖండ చిత్ర బృందం. ఇంద్ర‌కిలాద్రి నుంచి వెళ్లి మంగ‌ళ‌గిరిలోని పాన‌కాల ల‌క్ష్మీన‌ర‌సింహాస్వామిని అఖండ చిత్ర బృందం ద‌ర్శించుకున్న‌ది. 



మరింత సమాచారం తెలుసుకోండి: