బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ నటించిన చంద్రముఖి 2 సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను చేస్తోంది.ఈ సినిమా ప్రమోషన్ల కోసం సెప్టెంబర్ 23 హైదరాబాద్ వచ్చారు కంగనా రనౌత్. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ప్రభాస్‍తో కలిసి ఏక్ నిరంజన్ 2 సినిమా చేసే అవకాశం వస్తే చేస్తారా? అనే ప్రశ్న కంగనాకు ఎదురైంది. దీనికి ఆమె సమాధానం చెప్పారు. అలాగే, పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ గురించి అద్భుతంగా మాట్లాడారు కంగనా రనౌత్.2009లో ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్‍ సరసన హీరోయిన్‍గా నటించారు కంగనా రనౌత్. ఆ తర్వాత మరే తెలుగు సినిమా చేయలేదు. పూర్తిగా బాలీవుడ్ మూవీలే చేశారు. అయితే, ఇప్పుడు ఏక్ నిరంజన్ 2 సినిమా చేయాల్సి వస్తే ప్రభాస్ పక్కన నటిస్తారా అనే క్వశ్చన్‍ నేడు ఎదురుకాగా.. ఆన్సర్ ఇచ్చారు కంగనా రనౌత్. ప్రభాస్‍తో కలిసి నటించేందుకు తాను ఇష్టపడతానని కంగనా అన్నారు. డార్లింగ్ ప్రభాస్‍పై ప్రశంసల వర్షం కురిపించారు.

"ఆయన(ప్రభాస్)తో కలిసి పని చేసేందుకు ఇష్టపడతా. ఆయన సక్సెస్ పట్ల చాలా సంతోషపడుతున్నా. పాన్ ఇండియా స్టార్‌గా ఆయన అద్భుతంగా ఎదిగారు. మేం ఆ సినిమా (ఏక్ నిరంజన్) చేసినప్పుడు మా వయసు చాలా తక్కువ. ఆయన చాలా గొప్పగా ఆతిథ్యమిచ్చారు. ఫామ్ హౌస్‍లో మాకు అద్భుతమైన ఆహారం ఇచ్చారు. ఆయన చాలా దయాగుణం ఉన్న వ్యక్తి. మేం చాలా సరదాగా గడిపాం. మేం ఇద్దరం చాలా ఆటపట్టించునే వాళ్లం కూడా. ఆప్యాయంగా ఉండే వాళ్లం. ఇప్పుడు ఆయనతో కలిసి పని చేసే అవకాశం వస్తే.. చేస్తా. ఆయనను కలిసేందుకు కూడా ఇష్టపడతా. ఆయనను కలిసి దాదాపు పదేళ్లవుతోంది. వ్యక్తిగా, నటుడిగా ఆయన ఎదిగిన తీరును చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా" అని కంగనా రనౌత్ అన్నారు.చంద్రముఖి 2 సినిమా సెప్టెంబర్ 28న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం (సెప్టెంబర్ 24) సాయంత్రం హైదరాబాద్‍లో జరగనుంది. 2005లో వచ్చిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‍గా 18ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రముఖి 2 వస్తోంది. ఈ చిత్రానికి కూడా పి.వాసు దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్లు చంద్రముఖి 2పై అంచనాలను పెంచాయి

మరింత సమాచారం తెలుసుకోండి: