త్రిబుల్ ఆర్ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా గేమ్ చేంజర్. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న  ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కంప్లీట్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి 'గేమ్ చేంజర్' షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాని ప్రకటించి చాలా కాలం అవుతున్నప్పటికీ కనీసం ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అప్పుడెప్పుడో టైటిల్ అనౌన్స్మెంట్ అంటూ ఓ చిన్న వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో మూవీ టీం పై రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర

 అసంతృప్తి వ్యక్తం చేశారు. దానికి తోడు షూటింగ్ కూడా పలుమార్లు వాయిదా పడుతోంది. వీటన్నిటికీ కారణం శంకర్ రెండు పడవలపై కాలు పెట్టి ప్రయాణం చేస్తుండటమే. అంటే ఓవైపు 'ఇండియన్ 2' మరోవైపు 'గేమ్ చేంజర్' ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి జరుగుతున్నాయి. సాఫీగా సాగుతున్న 'గేమ్ ఛేంజర్' షూటింగ్ మధ్యలో 'ఇండియన్ 2' మూవీని తీసుకొచ్చాడు శంకర్. దాంతో గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతూ బడ్జెట్ కూడా పెరుగుతూ వస్తోంది. 'ఇండియన్ 2' పై క్లారిటీ ఇస్తున్నప్పటికీ 'గేమ్ చేంజర్' షూటింగ్ అసలు ఎక్కడ వరకు వచ్చిందో మాత్రం స్పష్టత రావడం లేదు. దానికి తోడు సినిమా నుంచి లీక్స్ కూడా ఎక్కువైపోవడంతో ఫ్యాన్స్ ఈ విషయంలో తీవ్ర నిరాశ చెందుతున్నారు. 

రీసెంట్ గానే కోట్లు ఖర్చుపెట్టి తెరకెక్కించిన ఓ సాంగ్ కూడా అనూహ్యంగా లీకై బయటకు వచ్చేసింది. అలా సినిమాకి తరచూ ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈరోజు (సెప్టెంబర్ 24) న జరగాల్సిన 'గేమ్ చేంజర్' లేటెస్ట్ షెడ్యూల్ మళ్లీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా  వేదికగా తెలియజేసింది." కొంతమంది నటీనటుల డేట్స్ దొరకకపోవడంతో (నడినటులు అందుబాటులో లేనందున) గేమ్ చేంజర్ సెప్టెంబర్ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. తిరిగి అక్టోబర్ రెండో వారంలో షూటింగ్ మొదలవుతుందని" ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ పేర్కొంది. దీంతో ఈ న్యూస్ విని మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: