టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్ తో ఫిష్ వెంకట్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో గత కొంతకాలంగా బాధ పడుతున్న ఫిష్ వెంకట్ నిన్న రాత్రి ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలం క్రితం డయాలసిస్ కోసం ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు రెండు కిడ్నీలు మార్పిడి చేయాలనీ సూచించారు.

ఫిష్ వెంకట్  వైద్యానికి అవసరమైన ఖర్చులను భరించడానికి తెలంగాణ  సర్కార్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.  వైద్య సేవలు  అందలేని దీన స్థితిలో ఉన్నామని  దాతలు సహాయం చేయాలని  ఫిష్ వెంకట్  కుటుంబ సభ్యులు కోరిన సంగతి తెలిసిందే.  ఇంతలోనే ఫిష్ వెంకట్  మృతి చెందడం  అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.   కమెడియన్ గా,  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 100కు పైగా సినిమాలలో  ఫిష్ వెంకట్  నటించారు.

వీవీ వినాయక్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్  హీరోగా తెరకెక్కిన ఆది   సినిమాతో ఫిష్ వెంకట్ కు మంచి గుర్తింపు దక్కింది.  తొడగొట్టు చిన్నా అంటూ  ఫిష్ వెంకట్  ఈ సినిమాలో  చెప్పిన డైలాగ్  ఈ సినిమాకు  హైలెట్ అయింది.  చెన్నకేశవ రెడ్డి, గబ్బర్ సింగ్, డీజే  టిల్లు, డాన్ శీను మరికొన్ని  సినిమాలు ఫిష్ వెంకట్ కు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి.  ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలపల్లి  వెంకటేష్.

మచిలీపట్నం ఆయన స్వస్థలం కాగా  గతంలో ఆయన చేపల వ్యాపారం చేశారు.  1991 సంవత్సరంలో విడుదలైన జంతర్  మంతర్ ఫిష్ వెంకట్  మొదటి సినిమా కావడం గమనార్హం.  కెరీర్  తొలినాళ్లలో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోయినా  సినిమాల్లో కెరీర్ ను కొనసాగించి తర్వాత రోజుల్లో ఫిష్ వెంకట్  మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.   దివంగత నటుడు శ్రీహరి తనను  ఎంతగానో ప్రోత్సహించాడని  ఫిష్  వెంకట్ పలు  సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఫిష్  వెంకట్  ఆత్మకు  శాంతి చేకూరాలని  నెటిజన్లు సోషల్ మీడియాలో  కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: