
ఇటీవలి రోజుల్లో బీహార్ ఎన్నికల ఇన్‌చార్జ్ ధర్మేంద్ర ప్రసాద్, రాష్ట్ర ఇన్‌చార్జ్ వినోద్ తావ్డే, లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పస్వాన్‌ల మధ్య జరిగిన భేటీకి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. లోక్ జనశక్తి పార్టీకి 25 సీట్లు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉందని సమాచారం. కానీ చిరాగ్ ఆ ఆఫర్‌ను సూటిగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆయన స్పష్టంగా 40 సీట్లు కావాలని డిమాండ్ చేశారట. అంతేకాదు, “ఆ 40 సీట్లలో ఒక్క సీటు కూడా తగ్గినా మేము ఊరుకోము” అని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకున్న విజయంతో తన పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందని చిరాగ్ విశ్వసిస్తున్నారు. అదే ధైర్యంతో ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్డీఏపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ సీట్ల డిమాండ్ వెనుక ఆయన స్పష్టమైన పొలిటికల్ స్ట్రాటజీ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎన్డీఏలో తన ప్రాధాన్యం తగ్గిపోతుందని భావించిన చిరాగ్, ఇటీవల ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీతో సన్నిహితంగా ఉన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.గతంలో కూడా చిరాగ్ పస్వాన్ తన పార్టీ ఎల్జేపీ (రామవిలాస్)ని స్వతంత్రంగా పోటీ చేయించడంతో ఎన్డీఏకి పెద్ద నష్టం కలిగించారు. ఆ ఎన్నికల్లో ఆయన దళిత ఓటు బ్యాంక్‌ను గణనీయంగా ప్రభావితం చేశారు. అందుకే ఈసారి కూడా చిరాగ్ తీసుకునే నిర్ణయం ఎన్డీఏపై కీలక ప్రభావం చూపుతుందని అనుకోవడం తప్పు కాదు.
ఇప్పుడు చిరాగ్ బీహార్ రాజకీయాల్లో ఒక పెద్ద ఈక్వేషన్‌ను మార్చగల వ్యక్తిగా మారిపోయారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, అది నేరుగా బీజేపీ, జేడీయూ మరియు మొత్తం ఎన్డీఏ కూటమిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కారణంగా బీజేపీ ప్రస్తుతం చిరాగ్‌తో చర్చలు జరిపి, ఆయనను ఒప్పించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోందట.రాజకీయ వర్గాల టాక్ ప్రకారం, మోడీ-నీతీష్ కూటమికి చిరాగ్ పస్వాన్ ఇప్పుడు ఒక కొత్త సవాల్‌గా మారిపోయారు. ఆయనకు ఉన్న యువ జనాదరణ, దళిత ఓటు బ్యాంక్, మరియు ఆయనకు ఉన్న చురుకైన రాజకీయ వ్యూహాలు—అన్ని —బీహార్ ఎన్నికల్లో ఒక పెద్ద ఫ్యాక్టర్‌గా మారే అవకాశం ఉంది.
ఇలాంటి పరిణామాల మధ్య, బీహార్ ఎన్నికలు ఇంకా మొదలవకముందే అక్కడి రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ఒక్క చిరాగ్ పస్వాన్ కదలికే ఇప్పుడు బీహార్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆయన తీసుకునే నిర్ణయాలపై ప్రస్తుతం మొత్తం ఎన్డీఏ దృష్టి సారించింది.మొత్తం మీద, బీహార్ అసెంబ్లీ ఎన్నికల సీజన్‌కి “చిరాగ్ పస్వాన్ ఫాక్టర్” మరింత వేడి తెచ్చిందని చెప్పాలి. ఆయన తలపెట్టిన వ్యూహాలు, ఆయన డిమాండ్లు, ఆయన భవిష్యత్ రాజకీయ నిర్ణయాలు — ఇవన్నీ రాబోయే రోజుల్లో బీహార్ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశముంది..!!