టాలీవుడ్‌లో ఎప్పుడూ కూల్, స్మార్ట్ టాక్‌తో ఉండే యంగ్ ప్రొడ్యుస‌ర్ బ‌న్నీ వాస్‌ ఇటీవల కాస్త హాట్ టాపిక్‌గా మారారు. సాధారణంగా స్టేజ్‌పై ఎంతో ప్రశాంతంగా, సూటిగా మాట్లాడే ఆయన, ఇటీవల జరిగిన ‘మిత్రమండలి’ ప్రి రిలీజ్ ఈవెంట్ లో కాస్త ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పెద్ద చర్చే మొదలైంది. ఆ వేడుకలో సినిమా ట్రైలర్‌పై సోషల్ మీడియాలో జరిగిన నెగెటివ్ క్యాంపైన్ గురించి ప్రస్తావించిన ఆయన, తనను తొక్కాలని ప్రయత్నించినా సాధ్యం కాదని, ఇలాంటి ప్రయత్నాలు తన వెంట్రుకకైనా తాకవని బలంగా వ్యాఖ్యానించారు. అయితే, ఆ సమయంలో ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు కొంతమందికి బూతు అర్థం వచ్చేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బన్నీ వాసు ఆ వేడుక తర్వాత ట్రోల్స్, విమర్శలను ఎదుర్కొన్నారు. దీనికి తోడు మిత్ర‌మండ‌లి సినిమా కూడా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది.


బ‌న్నీ వాస్‌ భావోద్వేగంతో స్పందించినా, ఆ భాష స్టేజ్‌పై ఉపయోగించడం తగలేదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమైంది. ఈ విషయం అల్లు అరవింద్ చెవిన కూడా ప‌డింది. ఆయన బన్నీ వాసును పిలిచి గట్టిగా క్లాస్ వేసినట్లు తెలుస్తోంది. ఆ విషయం గురించి వాసు స్వయంగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పేశారు. ఆ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన బన్నీ వాసు మాట్లాడే ముందు నిర్మాత ఎస్కేఎన్ “వాసు గారు ఇప్పుడు మళ్లీ అగ్రెసివ్ స్పీచ్ ఇస్తారు” అని సరదాగా అన్నారు. దీనిపై బ‌న్నీ వాస్ స్పందిస్తూ “ ఇప్పుడు ఎలాంటి కాంట్రవర్శీలు లేవు. వెరీ కూల్‌గా ఉన్నాను. ఆ కాంట్రవర్శీ తర్వాత అరవింద్ గారు ఇచ్చిన క్లాస్, తిట్లు మా నాన్న కూడా ఎప్పుడూ ఇవ్వలేదు. అందుకే ఈ రోజు చాలా జాగ్రత్తగా, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. టైట్ షర్ట్ వేసుకొచ్చాను కూడా,” అంటూ స‌ర‌దాగా మాట్లాడారు.


ఇంతలో అల్లు అరవింద్ కూడా సరదాగా “ ఏదైనా వైరల్ కంటెంట్ ఇవ్వు ” అన్నారు. వెంటనే బన్నీ వాసు సమాధానంగా, “ వైరల్ కంటెంట్ ఇవ్వమంటారు , తర్వాత ఆయనే వైర్ పట్టుకుని కొడతారు ” అని చెప్పడంతో ఆడిటోరియంలో నవ్వుల వర్షం కురిసింది. ఇక చివరగా బన్నీ వాసు మాట్లాడుతూ, “ ఇంకో నాలుగు ఐదు నెలలు నేను వైరల్ కంటెంట్ ఇవ్వను. ఇప్పుడంతా జాగ్రత్తగా ఉంటాను ” అని స్పష్టంగా చెప్పారు. మొత్తం మీద , బన్నీ వాసు తన సరదా హ్యూమర్‌తో పరిస్థితిని సర్దుకున్నారు కానీ, ఆ ఒక్క ఘటన బ‌న్నీ వాస్‌కు పెద్ద పాఠమైందని పరిశ్రమలో చర్చ సాగుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: