
బేజింగ్‌స్టోక్ నియోజకవర్గంలో 7528 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా.. కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేసిన అరుణ్ కి 960 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన యూకేలో కౌన్సిలర్ గా గెలిచిన మొట్టమొదటి తెలుగు వాడయ్యాడు. యూకే లో కౌన్సిలర్ పదవీకాలం నాలుగేళ్లు కాగా.. విద్య, రవాణా, పర్యావరణ సమస్యలు, స్థానిక సామాజిక సేవలకు నిధులు, స్థానిక సౌకర్యాలు మొదలైన వాటి గురించి నిర్ణయాలు తీసుకోవడం యూకే కౌన్సిలర్ల బాధ్యత. 78 సీట్లకు కన్జర్వేటివ్ పార్టీ 56 గెలుచుకోగా.. హౌస్ ఆఫ్ ది లీడర్ ఎన్నుకునే అధికారం ఆ పార్టీ కౌన్సిలర్లకు దక్కింది.
ఇకపోతే గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని మైనేనివారిపాలెంలో జన్మించిన అరుణ్.. అమృతలూరు మండలం మోపర్రులో ఉన్న తన అమ్మమ్మ గోగినేని రంగనాయకమ్మ ఇంట్లో పెరిగారు. ఆయన తండ్రి వెంకటరావు మాజీ ఆర్మీ అధికారి. తల్లి కృష్ణకుమారి, హౌజ్ వైఫ్. అరుణ్ హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో బీటెక్ పూర్తి చేశారు. 1999లో హైదరాబాద్‌లోని సీఎంసీ సంస్థలో ఉద్యోగిగా చేరి.. కంపెనీ కోరిక మేరకు 2000లో ఇంగ్లండ్ వెళ్లారు. అనంతరం ఇంగ్లాండ్ లోని వించెస్టర్ బిజినెస్ స్కూల్ లో ఎంబీఏ పూర్తి చేశారు. తరువాత బ్రిటన్ రక్షణశాఖ సలహాదారుగా సేవలు అందిస్తూ వస్తున్నారు.
అరుణ్ కి ఇద్దరు కూతుర్లు కాగా ఆయన తన భార్యతో కలిసి గత 20 సంవత్సరాలుగా బేజింగ్‌స్టోక్ లోనే నివసిస్తున్నారు. వాలంటీర్ గా బేజింగ్‌స్టోక్ నగరవాసులకు అరుణ్ ఎన్నో సేవలు అందించారు. ఆయన సేవలను గుర్తిస్తూ 2017లో యూకే ప్రధాని సత్కరించారు. ఆయన 2019లో బెస్ట్ వలంటీర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. కరోనా కాలంలో ఆయన తన సొంత "సేవ కిచెన్" ద్వారా చాలా మందికి ఉచితంగా భోజనాలు అందించారు. అయితే 2021లో యూకే ప్రభుత్వం ఆయన సేవలను గుర్తిస్తూ విశేషమైన పురస్కారం అందించింది. అరుణ్ తన కృషి, పట్టుదల, మంచితనం, పరులకు సాయం చేసే గుణంతో బేజింగ్‌స్టోక్ వాసులకు హీరో అయ్యారు.
"నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను. నేను వారందరికీ ప్రాతినిధ్యం వహిస్తాను. కన్జర్వేటివ్ లకు మరింత విభిన్న వర్గాలు మద్దతు ఇస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. నేను మొన్నటిదాకా నార్డెన్‌లో నివసించాను. నాకు వార్డులో నివసించే చాలామంది స్నేహితులు అయ్యారు. నేను గత కొన్ని నెలలుగా స్థానిక పరిస్థితుల గురించి బాగా తెలుసుకున్నాను" అని ఆయన విజయం సాధించిన అనంతరం మీడియాతో చెప్పుకొచ్చారు.