ఒక రోడ్డు ప్రమాద ఘటనలో బెక్స్ కృష్ణన్ (45) అనే ఓ కేరళ వ్యక్తికి దుబాయ్ సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది. గత ఏడు సంవత్సరాలుగా బెక్స్ కృష్ణన్ దుబాయ్ లో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి మరణశిక్ష అమలు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. అతడిని కాపాడేందుకు కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ క్రమంలోనే మరొక ఎన్ఆర్ఐ బెక్స్ కృష్ణన్ ని మరణ శిక్ష నుంచి కాపాడే ఉద్దేశంతో కోటి రూపాయలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు కూడా కృష్ణన్ ను జనవరి నెలలో క్షమించి నష్టపరిహారం స్వీకరించేందుకు అంగీకరించారు.


పూర్తి వివరాలు తెలుసుకుంటే.. కేరళలోని త్రిసూర్ జిల్లాకు చెందిన కృష్ణన్ అబుదాబిలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఐతే కృష్ణన్ 2012 సెప్టెంబరు నెలలో ముసఫాకి కారులో బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కారు అదుపు తప్పి.. రోడ్డుపక్కనే ఆడుకుంటున్న చిన్నారుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సూడాన్ కి చెందిన ఒక బాలుడు అక్కడికక్కడే మరణించాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను పరిశీలించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోలీసులు కృష్ణన్ పై మర్డర్ కేస్ నమోదు చేశారు. ఐతే కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనకు 2013లో మరణ శిక్ష విధించింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే మగ్గిపోతున్నారు.



మరోపక్క ఆయన కుటుంబ సభ్యులు మరణ శిక్ష నుంచి కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆఖరికి బీజేపీ నేత సేతుమాధవన్ ను ఆశ్రయించి తమ కృష్ణన్ ను మరణ శిక్ష నుంచి కాపాడాలని వేడుకున్నారు. దీనితో సేతుమాధవన్ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త ఎంఏ యూసుఫ్ అలీతో మాట్లాడారు. తరువాత యూసుఫ్ అలీ కృష్ణన్‌కు సహాయపడేందుకు ఒకే చెప్పారు. ఐతే మృతుడి కుటుంబం దుబాయ్ నుంచి సూడన్ కి తిరిగి వెళ్ళిపోగా.. కృష్ణన్ కుటుంబ సభ్యులు వారిని దుబాయ్ కి పిలిపించి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించి మరణశిక్షను రద్దు చేయించేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నారు. బెక్స్ కృష్ణన్ తన ప్రాణాలను కాపాడిన యూసుఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ తన కుటుంబంతో కలిసి సాధారణ జీవితం గడిపే అదృష్టం దొరికిందని ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: