అఫ్గానిస్తాన్ లోని మహిళలు ఇప్పుడు తాలిబాన్ల ఆంక్షలకు లోబడి బతికే దుస్థితి దాపురించింది. మహిళలుగా వారి ఉనికి, ఆత్మగౌరవం ప్రమాదంలో పడిపోయింది. అందరూ బురఖాలో బందీ అవడం అక్కడి అరాచక పరిస్థితికి అద్దం పడుతోంది. ముస్లిం సంప్రదాయాలు ఉన్నా కాబుల్ రోడ్లపై ఒకప్పుడు మహిళలు మినీ స్కర్టులతో తిరిగేవారు. వారికి నచ్చినట్టుగా జీవించేవారు. 1970లో అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా స్వేచ్ఛ ఉండేది.  1996లో అఫ్గాన్ ను తాలిబాన్లు పరిపాలించినప్పుడు మగవారు కచ్చితంగా గడ్డం పెంచాలని, ఆడవారు బురఖా ధరించాలనే నియమం ఉండేది. టెలివిజన్, సినిమాలు, సంగీతంపై నిషేధం ఉండేది. పదేండ్లు దాటిన అమ్మాయిలు పాఠశాలకు వెళ్లడాన్ని కూడా నిషేధించారు. ఇప్పుడు తాలిబాన్లు అక్కడి ప్రజలను మళ్లీ ఆ పాతకాలానికే తీసుకెళ్తున్నారు. మహిళలను బురఖా కిందకు తోసేస్తున్నారు. తాలిబాన్లు మహిళలపై సామాజిక, మానసిక, శారీరక అకృత్యాలకు పాల్పడతారని ఐక్యరాజ్య సమితి కూడా అంచనా వేస్తోంది. అయినా వాటి కట్టడికి చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తోంది.
కాబుల్ లో మహిళలు బాగా చదువుకున్నారు. వారంతా ఆధునిక దుస్తులకు అలవాటు పడ్డారు. ఇప్పుడు బురఖాలో శరీరాన్ని బంధించడం వారికి ఇష్టం లేదు. అఫ్గాన్ లోని గజనీ, బమియాన్ ప్రాంతాల్లో ఇప్పటికీ పేదరికం ఉంది. అక్కడి మహిళలు బురఖా ధరిస్తూ ముస్లిం సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అయితే ధనవంతులు మాత్రం తమకు ఇష్టమైన దుస్తులు ధరిస్తూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇప్పుడు తాలిబాన్ల ఆదేశాలు వారిని ఇబ్బందులు పెడుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో ఆధునిక పోకడలు, గ్రామాల్లో సంప్రదాయ జీవన విధానం ఉండేది. ఇప్పుడు తాలిబాన్లు షరియా చట్టం ప్రకారం మహిళల హక్కులు నిర్ణయిస్తామని చెబుతూనే, అఫ్గానిస్తాన్ మొత్తం సంప్రదాయ విధానాలు పాటించాలని తాలిబాన్లు ఒత్తిడి చేస్తున్నారు.
1880-1901 మధ్య కాలంలో అఫ్గాన్ ను పాలించిన అబ్దుర్ రహమాన్ ఖాన్ మహిళల జీవితాలను మెరుగుపరిచేందుకు చాలా కృషి చేసినట్టు చరిత్ర చెబుతోంది. మహిళల జీవితాలకు ప్రతిబంధకంగా ఉన్న అనేక సంప్రదాయ చట్టాల్లో రహమాన్ మార్పులు తీసుకొచ్చారు. భర్త మరణించిన మహిళలు భర్త సోదరుడిని పెండ్లి చేసుకోవాలనే సంప్రదాయాన్ని రద్దు చేశారు. వివాహ వయసును పెంచడంతో పాటు ప్రత్యేక పరిస్థతుల్లో మహిళలు భర్తతో విడాకులు తీసుకునే హక్కును కల్పించారు. దీంతో పాటు మహిళలకు తండ్రి, భర్త ఆస్తిలో హక్కును అందించారు. ఇప్పుడు తాలిబాన్లు మహిళలను చెరలో బంధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: