ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఏపీ వరకూ ఇప్పటివరకూ ఏపీని పాలించిన నేతల్లో జనం గుండెల్లో నిలిచిన అతికొద్దిమందిలో వైఎస్‌ఆర్‌ ఒకరు. అలాంటి నాయకుడి రాజకీయ వారసత్వం ఈ ఎన్నికల్లో కీలకంగా మారుతోంది. ఇప్పటి వరకూ వైఎస్‌ వారసత్వం ఏపీలో జగన్‌దే.. వైఎస్‌ కొడుకుగానే జనం ప్రజలకు పరిచయం అయ్యారు. వైఎస్‌ హఠాన్మరణం తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకుని నేతగా ఎదిగారు. ఐదేళ్లు విపక్షంలో ఉన్నా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు.


ఇక వైఎస్‌ కుమార్తెగా ఉన్న షర్మిలకు మొదట్లో పెద్ద రాజకీయ ఆకాంక్షలేమీ లేవు. అన్న జైలులో ఉన్నప్పుడు పార్టీని బతికించుకోవడం కోసం ఆమె ఏకంగా వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేసింది. పార్టీని కాపాడింది. అయితే ఆ తర్వాత ఆమెకు పార్టీలో పదవులు దక్కలేదు. క్రమంగా అవి విబేధాలుగా మారాయి. అన్నతో ఆస్తి గొడవలు ఆ విబేధాలను మరింత పెంచాయి. అనూహ్యంగా ఆమె తెలంగాణలో వైఎస్సార్‌ పేరుతో పార్టీ పెట్టారు. కానీ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారు. ఆ తర్వాత ఏమనుకున్నారో..ఇక ఏకంగా అన్నపైనే పోరాటానికి దిగారు. కాంగ్రెస్‌లో చేరి పీసీసీ అధ్యక్షురాలు అయ్యారు.


ఏపీలో కాంగ్రెస్‌ను గెలిపించాలంటే అన్నపై పోరాడాలి. అందుకు షర్మిలకు తన బాబాయి హత్యోదంతం కలసివచ్చింది. హంతకులను గెలిపిస్తారా అన్న నినాదంతో ఆమె ఏకంగా సొంతగడ్డ కడప ఎంపీ ఎన్నికల్లో పోరాటానికి దిగారు. వైఎస్‌ జగన్‌, షర్మిల.. ఇద్దరి మధ్య ఇప్పడు మొహమాటాలు పోయాయి. నేరుగా విమర్శించుకుంటున్నారు. వీళ్లా వైఎస్‌ వారసులు అంటూ పరస్పరం దెప్పిపొడుచుకుంటున్నారు.


కడప ఎన్నికల్లో ఆమె ఏకంగా తన సోదరుడు వరసైన అవినాష్‌రెడ్డిపైనే పోరాటానికి దిగింది. అవినాష్‌కు జగన్‌ పూర్తి అండగా ఉన్నాడు. బాబాయ్ హత్యోదంతమే ప్రధాన ఎజెండాగా షర్మిల ప్రచారం చేస్తోంది. మరి ఈ ఎన్నికలు వైఎస్‌ అసలైన వారసుడెవరో తేల్చేస్తాయా.. కడపలో గెలిచి షర్మిల సంచలనం సృష్టిస్తారా.. గెలవకపోయినా.. గణనీయంగా ఓట్లు తెచ్చుకున్నా అది జగన్‌కు ముందు ముందు ఇబ్బందికరంగానే మారుతుంది. మరి వైఎస్‌ వారసత్వాన్ని ప్రజలు ఎవరికి కట్టబెడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: