రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. శాసనసభ స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విధానాన్ని పారదర్శకంగా చేపట్టిందన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా దాన్యం కొనుగోలు ఏర్పాట్లు చేసిందని పేర్కొంటూ రాష్ట్రంలో 8 వేల 636 రైతు భరోసా కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. రాష్ట్రంలో 10 లక్షల మంది రైతుల నుండి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించటమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు 9 వేల 800 కోట్ల రూపాయలను కేటాయించిందని ఆయన వివరించారు. సాధారణ రకం వరికి 1,940 రూపాయలు, గ్రేడ్ ఏ రకానికి 1960 రూపాయలు మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని స్పీకర్ చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 60 వేల 272 మంది రైతుల ఖాతాల్లో 9 వందల కోట్ల రూపాయలు జమ చేసిందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.60  లక్షల మంది రైతుల వద్ద నుండి 18.58 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని, దీని విలువ 3,633 కోట్ల రూపాయలు అని స్పీకర్ వివరించారు.

శ్రీకాకుళం జిల్లాలో 758 రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని స్పీకర్  పేర్కొన్నారు. 2 లక్షల 87 వేల మంది రైతులు ఉన్నారని, 10 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి కాగలదని అంచనా వేయడం జరిగిందని స్పీకర్ చెప్పారు. ఇందులో 7.86 లక్షల టన్నుల ధాన్యం సేకరించుట నిర్ణయించుకోగా ఇప్పటివరకు 19,523 మంది నుండి 1.17 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని తెలిపారు. దీని విలువ రూ.227 కోట్లు అని ఆయన చెప్పారు. ధాన్యం సేకరణ పారదర్శకంగా ప్రభుత్వం చేపట్టినప్పటికీ కొన్ని విమర్శలు వస్తున్నాయని ఆయన పేర్కొంటూ ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాలు ద్వారా అనేక ప్రయోజనాలు అందిస్తున్న సంగతిని అందిస్తున్నామని చెప్పారు. రైతులకు ముందుగానే ఏ తేదీన తీసుకురావాలో సూచిస్తూ రసీదులు అందిస్తున్నామని ఆ మేరకు వారు తీసుకురావచ్చని చెప్పారు. ప్రతి మండలంలో కనీసం 25 నుంచి 27 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రస్తుతం ఉన్నాయని గతంలో కేవలం నాలుగు నుండి ఐదు మాత్రమే ఉండేవని ఆయన వివరించారు. రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జిల్లా అధికారులకు జారీ చేశారని ఆ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ప్రయోజనాలను రైతులు పూర్తిస్థాయిలో అవగాహన పొందాల్సిన అవసరం ఉందని స్పీకర్ చెప్పారు. తద్వారా మంచి సేవలను పొందగలరని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏడు నుంచి ఎనిమిది కేజీల వరకు తరుగు పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడే సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు స్పీకర్ సీతారాం. కొనుగోలు కేంద్రాల్లో లోపాలు ఉంటే వాటిని సరి చేస్తామని ఆయన చెప్పారు. రైతు ప్రయోజన అజెండాకు మించిన ప్రాధాన్యత మరొకటి లేదని ఆయన పేర్కొంటూ రైతు భరోసా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తామని లోపాలు ఉంటే చర్యలు చేపడతామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: