ఏపీ కేబినెట్ తొలి సమావేశం ఇవాళ జరుగుతోంది...ఈ రోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో గల మంత్రివర్గ సమావేశం మందిరంలో మండలి సమావేశం జరుగుతోంది. తొలి కేబినెట్‌లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వైయస్ పలు ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధాప్య పింఛన్లు కానీ, కిడ్నీ రోగులకు నెలనెలా రూ. 10,000/- పింఛన్ కానీ, ఆశావర్కర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంపు తదితర నిర్ణయాలతో వైయస్ జగన్‌పై ప్రజల్లో మరింత ఆశలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న కేబినెట్‌ భేటిపై భారీ అంచనాలే ఉన్నాయి.    


రైతులు, మహిళలు, అవ్వా తాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎం జగన్  ఆదేశాల మేరకు అధికారులు ఎనిమిది అంశాలతో కేబినెట్‌ అజెండాను రూపొందించారు. అలాగే అక్టోబర్‌ 15 నుంచి అమలు చేయనున్న వైఎస్సార్ రైతు భరోసా పథకంపై చర్చించనున్నారు. అలాగే ప్రధానంగా ఆర్టీసిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధం అయిన దశలో కేబినెట్ భేటీ ఆసక్తి రేపుతోంది.   

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ఇవాళ కేబినెట్ చర్చించనుంది. సీఎం జగన్ కూడా ఆర్టీసినీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఆర్టీసిపై జరిగే చర్చ  లక్షలాది మంది ఆర్టీసీ కార్మికులందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు హోంగార్డుల జీతాల పెంపు.. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌, సీపీఎస్‌ రద్దుపై చర్చించనున్నారు.  


అలాగే తిరుమతి తిరుపతి బోర్డ్ రద్దు అంశంపై కూడా ఇవాళ తొలి కేబినెట్ చర్చించనుంది. టీటీడీ బోర్డును రద్దు చేసి కొత్త పాలకమండలిని ఎంపికపై ఇవాళ కేబినెట్‌లో కసరత్తు జరుగనుంది. ఇప్పటికే టీటీడీ ఛైర్మన్ పదవి సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డికి ఖరారు కాగా.. టీటీడీ మెంబర్ల పదవుల కోసం  పార్టీలో పలువురు సీనియర్ నాయకులు పోటీపడే అవకాశం ఉంది. మొత్తానికి జగన్ తొలి కేబినెట్‌పై ప్రజలతో పాటు, అన్ని రాజకీయ పక్షాల్లో ఆసక్తి నెలకొంది. ఈ తొలి కేబినెట్‌లో సీఎం జగన్ ప్రజలకు ఎలాంటి వరాలు కురిపిస్తారో చూడాలి.

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు, సీఎంగా సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలు ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకున్న వైయస్ జగన్..తొలి కేబినెట్‌లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో కాసేపట్లో తెలిసిపోతుంది. మొత్తంగా వైయస్ జగన్ దూకుడుగా వ్యవహరిస్తూ మంచి నిర్ణయాలతో మంచి సీఎంగా అనిపించుకుంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: