ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తీరుపై ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ఘాటైన విమర్శలు చేశారు. రుణమాఫీ 4,5 విడతలను జగన్ సర్కారు రైతులకు ఇవ్వడం లేదంటూ రచ్చ చేస్తున్న చంద్రబాబు వైఖరిని కన్నబాబు ఎండగట్టారు. ఈ అంశంపై చర్చకు చంద్రబాబు సిద్దమా అంటూ సవాల్ విసిరారు.


జగన్ సర్కారు రైతులకు రుణామాఫీ సొమ్ము ఎగ్గొడుతుందూంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని కన్నబాబు తిప్పికొట్టారు. రైతు సాధికారిక సంస్థ ఏర్పాటు చేసి దాని నుంచి రుణాలు తీసుకుని మరీ వారి కోసం ఒక్క పైసా కూడా గత ప్రభుత్వం ఖర్చు చేయలేదని మంత్రి ఆరోపించారు. రైతులకు మేలు కలిగించేలా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు ఆక్రోశాన్ని కలుగజేస్తున్నాయని కన్నబాబు మండిపడ్డారు.


ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఒక్క రోజు ముందు రైతు రుణమాఫీ జీవో ఎలా జారీ చేస్తారని మంత్రి ప్రశ్నించారు. 5 బడ్జెట్లు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం రైతు రుణమాఫీకి నిధులు కేటాయించలేని వైనాన్ని ఎండగట్టారు. రైతులకు ఇచ్చిన బాండ్లు కూడా చెల్లుబాటు కాని విధంగా ఉన్నాయన్నారు. టిడిపి చేసిన రాజకీయ వాగ్దానాన్ని వైసిపి ప్రభుత్వం తీర్చాలనటం విడ్డురంగా ఉందని కన్నబాబు ఎద్దేవా చేశారు.


చంద్రబాబు హయాంలో బకాయి పడిన ఇన్ పుట్ సబ్సిడీని కూడా తమ ప్రభుత్వమే చెల్లిస్తోందని అన్నారు. తాను తొలి సంతకం చేసిన పథకాన్ని కూడా చంద్రబాబు ఐదేళ్ల కాలంలో సరిగా అమలు చేయలేకపోయారని మంత్రి ఎద్దేవా చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఇచ్చే 6,500 రూపాయలు అక్టోబర్ 15 తేదీన ఒకే మారు అమలు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన కిసాన్ సమ్మాన్ యోజన పథకంతో కలిపే 12,500 రూపాయలను చెల్లింపు జరుగుతుందని ఇప్పటికే స్పష్టం చేశామని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం రైతులకు ప్రత్యేక ఖాతాలను తెరవాల్సిందిగా బ్యాంకులను కోరామని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: