హైదరాబాద్ టెక్కీలు ఇడ్లీ, చట్నీ, సాంబార్ బటన్ నొక్కితే వచ్చే ఇడ్లీ వెండింగ్ మిషన్ ను తయారు చేశారు. ఇప్పటివరకు టీ, కాఫీ, బీరు వెండింగ్ మిషన్లు చూశాం. బ్యాంకు ఖాతాలోని డబ్బులు ఏటీఎం మిషన్ ద్వారా తీసుకోవటం చూశాం. ఇకనుండి ప్రజలు సులభంగా వెండింగ్ మిషన్ సహాయంతో ఇడ్లీ, చట్నీ, సాంబార్ సులభంగా పొందవచ్చు. 15 మంది యువ ఇంజనీర్లు కష్టపడి ఇడ్లీ వెండింగ్ మిషన్ ను తయారు చేశారు. 
 
ఇడ్లీ వెండింగ్ మిషన్ ను రూపొందించటానికి దాదాపు 18 నెలలు యువ ఇంజనీర్లు శ్రమించారు. 18 నెలల శ్రమ తరువాత అనుకున్నది సాధించారు. ఈ ఇడ్లీ వెండింగ్ మిషన్ ద్వారా ఒకేసారి 160 ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ లో మొత్తం 80 ప్లేట్లు ఉంటాయి. బటన్ నొక్కిన తరువాత కేవలం ఒకటిన్నర నిమిషాల సమయంలో ఇడ్లీలు తయారై బయటకు వస్తాయి. ఇడ్లీలను 100 డిగ్రీల దగ్గర, సాంబార్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర నిల్వ చేసుకొనే అవకాశం ఉంది. 
 
ఆహార పదార్థాలను మిషన్ల ద్వారా తయారు చేయాలనే ఆలోచనతో ఇడ్లీ వెండింగ్ మిషన్ ను రూపొందించినట్లు ఇంజనీర్లు చెప్పారు. ఈ మిషన్ లో ఉండే సెన్సార్లు ఇడ్లీలు తయారైన వెంటనే సమాచారం అందిస్తాయి. వినియోగదారులకు ఈ ఇడ్లీ వెండింగ్ మిషన్ సహాయంతో రెండు ఇడ్లీలు, 60 మిల్లీలీటర్ల సాంబారు, 100 మిల్లీలీటర్ల చట్నీ వచ్చే విధంగా ప్రోగ్రామింగ్ చేశారు. యువ ఇంజనీర్లు ఈ వెండింగ్ మిషన్ తయారీలో ఎక్కడా ప్లాస్టిక్ ఉపయోగించలేదు. 
 
మిషన్ నుండి వినియోగదారులకు ఇడ్లీ, చట్నీ, సాంబార్ తో పాటు స్పూన్ కూడా వస్తుంది. డబ్బులు కూడా డిజిటల్ పద్దతిలో పేటీఎం, గూగుల్ పే ద్వారా మెషీన్ లో చెల్లించవచ్చు. డిజైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సాఫ్ట్ వేర్ నిపుణులు ఈ ఇడ్లీ వెండింగ్ మిషన్ కోసం పని చేశారు. కార్పొరేట్ సంస్థలు కూడా ఇంకా మార్కెట్ లోకి రాని ఈ వెండింగ్ మిషన్ పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి. ఇడ్లీ వెండింగ్ మిషన్ గురించి మరిన్ని వివరాలు www.idlimachine.com అనే వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: