తిరుపతిలో ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి నిర్మిస్తున్న గరుడవారధి చుట్టూ వివాదం కమ్ముకుంది. శ్రీవారి నామాలతో వారధి కోసం నిర్మించిన పిల్లర్ లు వివాదంగా మారాయి. ఎంతో పరమ పవిత్రంగా భావించే స్వామీ వారి నామాలను వాహనాలదారుల పాదాల కింద ఉండేలా ఏర్పాటు చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 


 
ఆధ్మాత్మిక నగరం తిరుపతికి నిత్యం వివిధ మార్గాల్లో దాదాపు 40 వేల వాహనాలు వస్తుంటాయి. బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా సుమారు లక్ష మంది తిరుమలకు వస్తుంటారు. వీరంతా తిరుపతిలో ట్రాఫిక్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాహనాల రద్దీ పెరగడం, రోడ్లన్నీ ఆక్రమణలతో నిండిపోవడంతో నగరంలో ప్రయాణం ఇబ్బందిగా మారింది. యాత్రికులే కాదు స్థానికులు కూడా రోడ్డుపైన సాఫీగా ప్రయాణించలేని పరిస్థితి. దీంతో తిరుచానూరు సమీపంలోని శిల్పారామం నుంచి కపిలతీర్థం వద్ద ఉన్న నంది కూడలి వరకు ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. 

 

తిరుపతి, తిరుమల అవసరాలే ఎక్కువగా ఉండడంతో టీటీడీ, నగరపాలక సంస్ధ నిధులతో 6కి.మీ. మేరకు స్మార్ట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. దీనికి గరుడ వారధి అని పేరుపెట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆప్కాన్‌ కిందటేడాది మార్చి నెలాఖరు నుంచి ఈ పనులు ప్రారంభించింది. రెండేళ్లలో పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టారు. ఆప్కాన్ సంస్థ తిరుచానూరు నుంచి కపిలతీర్థం వరకు డివైడర్లను తొలగించి బారికేడ్‌లను ఏర్పాటు చేసి భారీ యంత్రాలు సమకూర్చుకుంది. 300 మందికి పైగా కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు. 684 కోట్ల బడ్జెట్‌ తో 6 కి.మీ పొడవుతో నిర్మిస్తున్న ఈ వారధి పనులు ప్రస్తుతం మరింత వేగం పుంజుకున్నాయి. 

 

అన్ని నగరాల్లో నిర్మించే ఫ్లై ఓవర్ మాదిరిగా కాకుండా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వారధి నిర్మించాలని నగరపాలక సంస్థ, టీటీడీ అధికారులు భావించారు. అందులో భాగంగా స్వామి వారి నామాలు వచ్చేలా పిల్లర్లను రూపొందించారు. అయితే పిల్లర్లకు వేసిన శ్రీవారి నామాలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. స్వామివారి నామాలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి నామాలను ప్లై ఓవర్ పిల్లర్లకు వేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

 

మరికొందరు మాత్రం ఆధ్మాత్మిక క్షేత్రంలో భక్తిభావం పెంపోందించేలా నామాలు వేయడం మంచిదే అంటున్నారు. అయితే పిల్లర్ల వద్ద ప్రత్యేక గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం వారధి నిర్మాణంలో ఆధ్యాత్మికను ఎక్కడ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధ్యమైంత తొందరగా నిర్మాణం పనులు పూర్తిచేసి ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. అయితే నామాల వివాదంపై అధికారుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. భక్తులు వ్యక్తంచేస్తున్న అభిప్రాయలకు అధికారులు ఎలాంటి సమాధానమిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: