దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 158కి చేరింది. విదేశాంగ శాఖ విదేశాల్లోని 276 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ప్రకటన చేసింది. వీరిలో ఇరాన్ లోనే 255 మందికి కరోనా సోకినట్లు విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా చికిత్స అనంతరం 14 మంది కోలుకున్నారు. 
 
నిన్న రాజ్యసభలో కొంత సమయం మాస్కుల గురించి చర్చ జరిగింది. రాజ్యసభకు ఎంపీ డెరెక్‌ ఓ బ్రేన్‌, నలుగురు టీఎంసీ సభ్యులు మాస్క్‌లతో రాగా ఛైర్మన్ వెంకయ్యనాయుడు మొదట సభ నిబంధనల ప్రకారం సభ్యులు మాస్క్‌లు ఉపయోగించరాదని హెచ్చరించారు. కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం ఆ వ్యాఖ్యలకు స్పందిస్తూ కేంద్రం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో మాస్క్‌లను తప్పినిసరిగా వినియోగించాలని ఆదేశించిందని చెప్పారు. 
 
చిదందరం వివరణతో వెంకయ్య మాస్క్ లు ధరించడానికి అంగీకరించారు. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల సభ్యులు కరోనా ముప్పు నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను కుదించాలని లేదా వాయిదా వేయాలని కోరారు. కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ గౌడ ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రజలను తాము కలుసుకుంటూ ఉంటామని, అందువల్ల తమకు వైరస్ ముప్పు అధికంగా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఛైర్మన్ ఈ అభ్యర్థనను తోసిపుచ్చారు. 
 
కరోనా ముప్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ మరో నెల రోజుల పాటు ఎలాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం కరోనాపై నకిలీ వార్తలు ప్రచారం చేస్తే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. మార్చి 31వరకు ఐఐటీ బాంబే క్యాంపస్ ను మూసివేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. పారా మిలటరీ సిబ్బందికి అత్యవసరం కాని సెలవులు రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.          

మరింత సమాచారం తెలుసుకోండి: