నిర్భయ దోషుల ఉరితీతకు ఏర్పాట్లు పౌర్తయ్యాయి. శుక్రవారం ఉదయం నలుగురిని ఉరి తీయనున్నారు. అయితే దోషులను ఎలా ఉరితీస్తారు..? శిక్ష అమలుకు ముందు అధికారులు ఏం చేస్తారు..? తెల్లవారుజామునే ఎందుకు ఉరి తీస్తారు..?  

 

ఏదైనా కేసులో ఉరిశిక్ష అమలు చేయాలంటే... నేరం జరిగిన ప్రాంతం పరిధిలోనే దోషులకు మరణశిక్ష అమలు చేస్తారు. నిర్భయ ఘటన ఢిల్లీలో జరగడంతో... తీహార్ జైల్లోనే ఉరి తీస్తారు. శుక్రవారం ఉదయం 5:30 నిమిషాలకు ఉరి తీస్తారు. ఐతే అంతకు ముందు...జైలు నియమావళి ప్రకారం ప్రోటోకాల్ అనుసరించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే గురువారం సాయంత్రం ఏడింటికి దోషులు కోరుకున్న భోజనం అందించారు. నలుగురు దోషులను ఇప్పటికే జైలు నెంబర్‌ మూడులోకి తరలించారు. నలుగురిని వేర్వేరు సెల్స్‌లో ఉంచారు. 


తెల్లవారుజామున 2:30 గంటలకు  ఖైదీలను నిద్రలేపుతారు. హెయిర్ కట్‌, షేవింగ్‌లాంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. 10 నిమిషాల తర్వాత.. స్నానం చేయాలని సూచిస్తారు. ఆ తర్వాత ఎస్పీ, డీఎస్పీ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌, వైద్యాధికారి  నలుగురు దోషులు ఉన్న సెల్‌ వద్దకు చేరుకుంటారు. డెత్ వారెంట్‌లో ఉండే వివరాలతో ఖైదీలను సరిపోల్చుకుంటారు. ఆ తర్వాత దోషులకు అతడు చేసిన నేరం, విధించిన శిక్షకు సంబంధించిన తీర్పు, అమలు వారెంట్‌ను ఖైదీకి అర్థమయ్యే భాషలో విన్పిస్తారు. అనంతరం 20 నిమిషాలకు ఖైదీకి అతను కోరిన అల్పాహారం అందజేస్తారు. 


అల్పాహారం తర్వాత ఖైదీలు కోరుకుంటే మతపరమైన పుస్తకాన్ని ఇస్తారు. లేదంటే ప్రార్థనకు అవకాశమిస్తారు. ఆ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ సమక్షంలో దోషుల ముఖానికి నల్ల ముసుగు వేస్తారు. ఆ తర్వాత చేతులను వెనక నుంచి తాళ్ళతో బంధిస్తారు. ఒకవేళ ఖైదీ కాళ్లకు సంకెళ్లు ఉంటే వాటిని తొలగిస్తారు. అనంతరం ఇద్దరు వార్డెన్‌లు ఉరికంభంవైపు నడిపిస్తారు. ఒకవేళ ఖైదీలు ఏదైనా వీలునామా రాయాలనుకుంటే దానికి కూడా ఏర్పాట్లు చేస్తారు. అందులో తమ చివరి కోరికను తెలిపే అవకాశం ఉంది. ఖైదీలు కోరుకుంటే వారి మత విశ్వాసాల ఆధారంగా ఉరి తీసే సమయంలో పండితులు, మౌల్వీ లేదా ఫాదర్‌ను ఏర్పాటు చేకసుకోవచ్చు. ఐతే అందుకు జైలు సుపరింటెండెంట్ అనుమతించాలి. ఏర్పాట్ల బాధ్యత జైలు సూపరింటెండెంట్‌పైనే ఉంటుంది. తాడు, ముసుగు, ఉరి కంభం... ఇలా ఉరికి అనువైన ఏర్పాట్లన్నీ సరిగ్గా జరిగాయో లేదో ఆయనే సరిచూసుకోవాలి. ఉరిశిక్ష అమలుచేసే సమయంలో జైలు సూపరింటెండెంట్, జైలు వైద్యాధికారి, జిల్లా మేజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ సాక్షులు తప్పనిసరిగా ఉండాలి.


దోషులు ఉరి కంభం చేరుకునేలోపే అక్కడ సూపరింటెండెంట్‌, మెజిస్ట్రేట్‌, వైద్యాధికారి ఉంటారు. తరువాత ఖైదీని తలారీకి అప్పగిస్తారు. ఇద్దరు వార్డెన్‌ల సాయంతో ఖైదీలను ఉరికంబం వద్దకు తీసుకెళ్తారు. ఆ తర్వాత కాళ్ళు కదలకుండా రెండు కాళ్ళ బొటన వేళ్ళను చిన్న తాడుతో గట్టిగా కడతారు. మేజిస్ట్రేట్ సంకేతం ఇవ్వగానే.. తలారి లీవర్‌ను లాగుతాడు. ఉరితాడు బిగిసిన తర్వాత అరగంట వరకు ఆ ఖైదీ శరీరాన్ని అలాగే ఉంచుతారు. డాక్టర్ మరణించినట్లు నిర్ధారించాక... హోంశాఖకు వివరాలు అందిస్తారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. వారు వద్దనుకుంటే జైలు పరిసరాల్లోనే ఖననం చేస్తారు.


ఖైదీని తెల్లవారుజామునే ఎందుకు ఉరి తీస్తారంటే.. తెల్లవారుజామున అయితే ఖైదీలంతా నిద్రలో ఉంటారు. ఆ సమయంలో అంతా ప్రశాంతగా ఉంటుంది. బ్రిటిషర్లు ఉరిశిక్షను ప్రొద్దున్నే అమలు చేసేవారు. అదే సంప్రదాయం ఇప్పటికి కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: